మాకవరపాలెం: రాష్ట్రస్థాయి చెస్ పోటీలు రసవత్తరంగా సాగాయి. జిల్లా చెస్ అసోసియేషన్, ప్రగతి చెస్ అకాడమీ సంయుక్తంగా తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాలకు చెందిన 180 మంది హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెస్ పోటీలు ఎంతో రసవత్తరంగా కొనసాగాయి. ఈ పోటీల్లో విశాఖ జిల్లాకు చెందిన అఖిలప్రసాద్ ప్రథమ, ప్రకాశం జిల్లాకు చెందిన జె.కె.రాజు ద్వితీయ, అనకాపల్లి జిల్లాకు చెందిన బి.సాకేత్ తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. వీరికి ప్రథమ బహుమతిగా రూ.5,100, ద్వితీయ రూ.4000, తృతీయ రూ.3000 నగదు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అవంతి కళాశాల మెకానికల్ విభాగం హెడ్ హరికిరణ్, ప్రగతి చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు సుదీర్, ఏిపీటీఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, గౌతమి లలిత కళా కేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు రంగరాజు, శేషగిరిరావు పాల్గొన్నారు.