కొత్త పింఛన్లు ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లు ఎప్పుడు?

Mar 16 2025 2:08 AM | Updated on Mar 16 2025 2:04 AM

ఆత్రుతగా ఎదురుచూస్తున్న అర్హులు

కూటమి ప్రభుత్వం 9 నెలల్లో ఒక్కరికై నా కొత్తగా పెన్షన్‌ ఇచ్చిందా?

నిలదీసిన జెడ్పీటీసీ సభ్యులు

మన్యంలో చిన్నారుల మృత్యు ఘోషపై వాడీవేడి చర్చ

గరంగరంగా జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు

మహారాణిపేట (విశాఖ): కూటమి ప్రభుత్వంలో కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవడంపై పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారని, దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ జె.సుభద్ర అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం, గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల వెంకట గిరిబాబు మాట్లాడుతూ పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన కుటుంబ సభ్యులకు పింఛన్లు ఇస్తామని ప్రకటించారని, కానీ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అలాగే అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలు అవుతున్నా ఎక్కడా కొత్త పింఛన్లు ఇవ్వలేదని, ఇది అన్యాయమన్నారు.

ఏజెన్సీలో పిల్లల మృతిపై ఆందోళన

ఏజెన్సీలో వైద్య సదుపాయాలపై, పిల్లల మరణాలపై చర్చ జరిగింది. తొలుత అరకు జెడ్పీటీసీ చెట్టి రోష్ని మాట్లాడుతూ అరకు మండలం బస్కి గ్రామంలో పిల్లలు ఆకస్మికంగా మృతి చెందారని, ఈ విషయం గురించి మాట్లాడడానికి తాను హెల్త్‌ సబ్‌ సెంటర్‌కు కాల్‌ చేసినా ఎవరూ ఫోన్‌ ఎత్తడం లేదన్నారు. గిన్నెల, మాడగూడ తదితర ప్రాంతాల్లో చిన్న పిల్లలు వరుసగా చనిపోయారని, కారణం తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరణ ఇవ్వాలని చైర్‌పర్సన్‌ జె.సుభద్ర కోరారు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక్క అధికారి కూడా రాలేదని, జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు రాని అధికారులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆమె సీఈవోను కోరారు.

జెడ్పీటీసీలను పట్టించుకోని హౌసింగ్‌ అధికారులు

హౌసింగ్‌ అధికారులు జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులను పట్టించుకోవడం లేదని పలువురు చైర్‌పర్సన్‌ దృష్టికి తెచ్చారు. తమ మండలాల్లో గృహ నిర్మాణ అధికారులు సర్వే చేస్తున్న సమయంలో, కొత్త పేర్ల నమోదు చేసేటప్పుడు తమను సంప్రదించడం లేదని, దీనివల్ల స్థానికంగా తాము ఇబ్బంది పడుతున్నామని, గతంలో ఎప్పుడూ ఇలా లేదని వారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్‌ కోరారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వస్తామని అధికారులు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల డ్రాపవుట్స్‌ పెరుగుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌ ఈర్లె అనురాధ కోరారు. పాయరావుపేట నుంచి అనకాపల్లి వరకు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, అందువల్ల అనకాపల్లిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోమ సత్యనారాయణ కోరారు. అనకాపల్లి నుంచి మామిడిపాలెం వెళ్లే రహదారిలో నాణ్యత లోపించిందని జెడ్పీ కోఆప్షెన్‌ సభ్యుడు పెతకంశెట్టి శివ సత్యనారాయణ ఆరోపించారు. ఈ పనులకు రూ.30 లక్షల మేరకు నిధులు ఖర్చయినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని, గుంతల్లో డస్ట్‌తో పూడ్చడం వలన నాణ్యత లోపించిందని అన్నారు.

అక్రమ ఇసుక తవ్వకాలు కనిపించలేదా..!

కోటవురట్ల మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జెడ్పీటీసీ సభ్యురాలు సిద్ధాబత్తుల ఉమాదేవి ధ్వజమెత్తారు. వరాహనదిలో పైలట్‌ ప్రాజెక్టు సమీపంలోనే అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటితే నక్కపల్లి, ఎస్‌.రాయవరం, కోటవురట్ల మండలాలకు సంబంధించి 36 గ్రామాలకు తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. సమావేశంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్‌ సీఈవో పి.నారాయణమూర్తితోపాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కొత్త పింఛన్లు ఎప్పుడు? 1
1/2

కొత్త పింఛన్లు ఎప్పుడు?

కొత్త పింఛన్లు ఎప్పుడు? 2
2/2

కొత్త పింఛన్లు ఎప్పుడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement