తుమ్మపాల: గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్‌గా ప్రభుత్వ సర్వీస్‌లో చేరిన ఉద్యోగి ఎటువంటి పదోన్నతి లేకుండానే రిటైర్ అవుతున్నాడని, ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రమోషన్లు కల్పించాలని మెడికల్ లేబొరేటరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గీతారాణి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎంహెచ్‌వో రవికుమార్, డీసీహెచ్‌ఎస్ శ్రీనివాసరావు, సీఎస్ ఆర్‌ఎంవో గౌతమ్, అల్లూరి జిల్లా డీసీహెచ్‌ఎస్ కృష్ణారావు విచ్చేసి ల్యాబ్ టెక్నిషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గీతారాణి మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలపై అధికారులకు వివరించారు. వారికి పని భారం తగ్గించే విధంగా ప్రతి పీహెచ్‌సీలో అదనంగా మరో పోస్టు భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసాగా క్రమబద్ధీకరణ కొనసాగించాలన్నారు. అన్ని విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎస్ శంకరరావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.