రోలుగుంట: రోజురోజుకు క్వారీ యాజమాన్యానికి, స్థానిక రైతుల మధ్య వివాదం తీవ్రతరం అవుతున్నా అధికారులు, స్థానిక నాయకులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టం చేకూర్చే క్వారీలు ఆపండని బాధిత రైతులు కోరుతున్నా నాయకులు పట్టించుకోవడంలేదు. తమకు ప్రభుత్వ అనుమతి ఉందని, స్థానిక నాయకులతో సత్సంబంధాలున్నాయని, మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ క్వారీ యాజమాన్యం చెప్పడంతో శరభవరం, రాజన్నపేట, గొల్లపేట, వడ్డిప గ్రామాల రైతులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం వరకూ సుమారు 25 రోజుల పాటు నల్లరాయి రవాణా ఆపిన యజమాన్యం తిరిగి దానిని కొనసాగించింది. దీంతో పలువురు రవాణా ఆపాలి, కొండలు పేల్చడం మానేయాలంటూ యాజమాన్యాన్ని కోరారు. అయితే వారు దీన్ని పట్టించుకోలేదు. లారీల్లో డ్రైవర్లుగా సమీప గ్రామస్తులకు అవకాశం కల్పించి ఉపాధికి తోడ్పాటునందిస్తున్నాం అంటూ చెబుతున్నారు.
దీంతో యాజమాన్యానికి, సమీప గ్రామాల రైతులకు వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శరభవరం గ్రామానికి చెందిన జలుమూరి సత్తిబాబు అనే రైతు మానసిక వ్యధతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యం అందించడంతో కోలుకోగా గురువారం రాత్రి సత్తిబాబుని పంపించేశారు. దీంతో బాధిత గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజా సంఘాల మద్దతు తీసుకుని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
క్వారీ లారీలు ఆపాలని రైతుల ఆందోళన