నక్కపల్లి:
వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఉపమాక వెంకన్న చక్రవారి స్నానం శుక్రవారం ఘనంగా జరిగింది. పౌర్ణమినాడు వేంకటేశ్వరస్వామి అత్తవారింటికి (సముద్రుడి) వెళ్లే సన్నివేశాన్ని చక్రవారి స్నానంగా పిలుస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని రాజాధిరాజవాహనంపై ఉంచి రాజయ్యపేట సముద్రతీరానికి తీసుకెళ్లారు. ప్రతేకంగా ఏర్పాటు చేసిన పందిట్లో స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి, చక్రపెరుమాళ్లను సముద్ర తీరానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సముద్ర జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకించారు. సాగర జలాలతో అభిషేకం అనంతరం సాయంకాల తిరువారాధన, స్వప్న తిరుమంజనం అనంతరం నాలాయిర సేవాకాలంలో ఆరాధన, ప్రసాద నివేదన కార్యక్రమాలు జరిగాయి. స్వామివారి చక్రవారి స్నానం సందర్భంగా పలువురు భక్తులు సముద్రంలో స్నానం చేసేందుకు పోటీ పడ్డారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పలువురు తోడపెద్దులు, అమ్మవారి ఘటాలను తీసుకువచ్చి సముద్ర స్నానమాచరింపచేశారు. అనంతరం స్వామివారిని ఆలయానికి తీసుకు వచ్చి ఆలయంలో అద్దాల మండపంలో స్వామివారికి డోలోత్సవం (అద్దపు సేవ) నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది.
నాగవల్లి వసంతోత్సవానికి పోటెత్తిన భక్తులు
బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి నాగవల్లి వసంతోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. వేంకటేశ్వరస్వామి 152వ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు శుక్రవారం జరిగిన ఈ వేడుక నేత్రపర్వంగా సాగింది. రాష్టం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను కొండ దిగువకు దించి గజ గరుడ వాహనాలపై ఉంచి వడ్డాది పుర వీధుల్లో తిరువీధి వసంతోత్సవం నిర్వహించారు. సన్నాయి, మేళతాళాలతో డప్పులు, వాయిద్యాల నడుమ వేలాది మంది భక్తులు రంగులు పులుముకుంటూ స్వామివారిపై రంగులు జల్లి ఆనందంతో పులకించారు. అనంతరం వసంతాన్ని తమపై జల్లుకుని భక్తిభావంలో స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. భక్తులు స్వామి రథం వెంట పురవీధుల్లో తిరుగుతూ భక్తి పాటలు పాడుతూ, భజనలు చేస్తూ ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తూ స్వామిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వడ్డాది శారదా నదిలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు శాస్రోక్తంగా వేదపండితుల సమక్షంలో ఈవో శర్మ, ఆలయ సిబ్బంది చక్రస్నానం చేయించారు. స్వామివారితో పాటు పలువురు భక్తులు శారదా నదిలో స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను గిరిజాంబ కొండపైకి చేర్చారు. రాత్రికి ఆలయం వద్ద భారీ మందుగుండు సామగ్రి కాల్చివేత భక్తులకు కనువిందు చేసింది. వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్‌లో వర్తక సంఘం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
నేత్రపర్వం.. వెంకన్న చక్రతీర్థం
నేత్రపర్వం.. వెంకన్న చక్రతీర్థం