విశాఖ విద్య : ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా మోడల్ స్కూళ్లను తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేసి, చుట్టు పక్కల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఇందులో విలీనం చేసేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దూరంగా వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు ఇస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. ప్రాథమిక విద్యకు విఘాతం కలిగేలా కూటమి ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ పేరిట స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది పారదర్శకంగా జరగడం లేదు. పాఠశాలల పునర్నిర్మాణంపై వ్యతిరేకత లేకుండా చూడాలనే కూటమి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో దీనిపై నేరుగా జిల్లా కలెక్టర్లు రంగంలోకి దిగారు. దీంతో బడిలో బలవంతపు తీర్మానాలు జరిగిపోతున్నాయి.
పాఠశాలల పునర్నిర్మాణం ఇలా..
పాఠశాలల పునర్నిర్మాణంలో భాగంగా ఇక నుంచి శాటిలైట్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2), ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, అలాగే 1, 2 తరగతులు), మోడల్ ప్రైమరీ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు), హైస్కూళ్లు (6 నుంచి 10 వరకు) ఉండేలా కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను దానిలోకి తరలిస్తారు. 60 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే దాన్ని యథావిధిగా కొనసాగిస్తారు. మిగతా స్కూళ్లలో కేవలం 1, 2 తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు పూర్తిగా కనుమరుగైపోతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో విలీనానికి సై అంటున్నారా..?
కూటమి ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఇంకా తగ్గిపోతాయని ఉపాధ్యాయులు బాహాటంగానే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత నిర్ణయాలతో చాలా స్కూళ్లలో 1, 2 తరగతుల నిర్వహణకు విద్యార్థులు లేక, స్కూళ్లకు తాళాలు వేయాల్సిందే. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలలు మూతపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల నుంచి ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్మానాలు వస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్‌లో తమ బడి మూతపడుతుందనే విషయం వారికి తెలిసే, ఇదంతా జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మిగులు ఉపాధ్యాయుల దారెటో..
ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటి వరకు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు (ఎస్జీటీ) పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో 783 మంది, అనకాపల్లిలో 2,114 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,566 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. 3, 4, 5 తరగతులను మోడల్ స్కూళ్లకు తరలించినట్లయితే, ఆయా పాఠశాలల్లో ఇక ఒక్కరే ఉపాధ్యాయుడు పనిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మూడు జిల్లాల్లో కలిపి ఆరు వందలకు పైగానే ఉపాధ్యాయులు సర్‌ప్లస్‌గా ఉంటారు. రేషనలైజేషన్ పేరుతో వీరిలో ఎక్కువ మందిని అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి పంపించాల్సి ఉంటుంది. 117 జీవో అమల్లో భాగంగా జరిగిన రేషనలైజేషన్‌తో ఏజెన్సీకి వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పట్లో వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం తాజాగా చేపడుతున్న చర్యలతో మిగులు ఉపాధ్యాయులు దారెటనేది ప్రశ్నార్థకమే.
తుదిదశకు స్కూళ్ల పునర్నిర్మాణం ప్రక్రియ
ప్రభుత్వ నిర్ణయానికి విశాఖలో 40.45 శాతం వ్యతిరేకత
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 85 శాతం ఓకేనట
మూతపడనున్న ప్రాథమిక పాఠశాలలు
అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆందోళన
స్కూళ్ల పునర్నిర్మాణంపై అభిప్రాయ సేకరణ ఇలా..
జిల్లా మండలాలు పంచాయతీలు ప్రభుత్వ అభిప్రాయ సేకరణ అభిప్రాయ సేకరణలో
స్కూళ్లు పూర్తయిన స్కూళ్లు ఆమోదం శాతం
విశాఖపట్నం 11 161 560 440 81.63
అనకాపల్లి 24 667 1,408 1,159 84.85
అల్లూరి 22 421 1,673 1,587 98.02
మోడల్ స్కూళ్లుపై అభిప్రాయ సేకరణ ఇలా..
జిల్లా ప్రతిపాదిత మోడల్ స్కూళ్లు ఎస్‌ఎంసీల నుంచి వచ్చిన
వ్యతిరేకత శాతం
విశాఖపట్నం 178 40.45
అనకాపల్లి 180 15.53
అల్లూరి 252 15.88