కోటవురట్ల: ఆ దొంగ మంచి దొంగ.. ఎందుకంటే బీరువాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నప్పటికీ తనకు కావలసిన కొంత నగదు, బంగారాన్ని మాత్రమే కాజేసి జాలి చూపించాడు. పోలీసులు సైతం విస్తుపోయిన ఈ ఘటన రామచంద్రపాలెం శివారు సన్యాసిరాజుపాలెంలో గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. సన్యాసిరాజుపాలేనికి చెందిన శింగంపల్లి వరలక్ష్మి, కొండబాబు దంపతులు ఊరి చివర ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తున్నారు. కొడుకు లంకెలపాలెంలో చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. వరలక్ష్మి, కొండబాబు దంపతులు ఊళ్లో పని చేసుకుంటూ ఉంటారు. గత నెల 26వ తేదీన ఊళ్లో కొందరితో కలిసి ఉపాధి నిమిత్తం పడమటకు పని కోసం వెళ్లారు. అక్కడ పని ముగించుకుని గురువారం ఉదయం ఇంటికి తిరిగొచ్చారు. ఇంటి తలుపుకు వేసిన తాళం కప్ప ఉన్నదున్నట్టుగా ఉండగానే గెడ మాత్రం తప్పించి ఉండడాన్ని గమనించి ఆందోళనగా ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో బీరువా కూడా గెడ తప్పించి ఉండడం గుర్తించి వెంటనే నగదు, బంగారం కోసం వెతికారు. ఇంటి స్థలం కొనుగోలు కోసం దాచి ఉంచిన రూ.5 లక్షల్లో రూ.2.50 లక్షలు, 18 గ్రాముల బంగారు ఆభరణాలకు గాను 6 గ్రాముల చెవిదిద్దులు కనిపించలేదు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తీసుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీం చేరుకుని ఆధారాల కోసం ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై జరిగిన దొంగతనంపై ఆశ్చర్యపోయారు. ఎవరో తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉంటా రని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సన్యాసిరాజుపాలెంలో చోరీ