వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు‘ కార్యక్రమం అత్యంత విజయవంతం అయ్యిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలల పాలనలో యువతను, విద్యార్థులను, నిరుద్యోగులను నట్టేట ముంచిందని అన్నారు. ప్రతి పల్లెలో మద్యం ఏరులై పారుతుందని, మద్యం మీద చూపిస్తున్న శ్రద్ధ విద్యపై కూటమి ప్రభుత్వం చూపించడం లేదంటూ మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ప్రతి నిరుద్యోగికీ రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తాశారని మండిపడ్డారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7,200 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. కానీ గత బడ్జెట్లో కేటాయింపులు లేవని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఈ ఏడాది కూడా ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి వైఎస్సార్‌సీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే..ఇందులో 5 కళాశాలల్లో తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. మిగిలిన వాటిలో తరగతులు ప్రారంభించాల్సి ఉందని, కానీ వాటిని ప్రైవేటీకరించడానికి కూటమి సర్కార్ కుయుక్తులు పన్నుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందరికీ ఉచిత విద్య అందించాలనే ముందుచూపుతో అమ్మ ఒడి అందించిన ఏకైక సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. తక్షణమే కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.