దైన్యం.. జూలో మూగ జీవాల వైద్యం | - | Sakshi
Sakshi News home page

దైన్యం.. జూలో మూగ జీవాల వైద్యం

Mar 12 2025 8:16 AM | Updated on Mar 12 2025 8:11 AM

● ఇటీవల పుట్టిన రెండు సింహం పిల్లలు మృతి ● వారాల తరబడి పోటీ పడి మరీ సెలవుల్లో వైద్యులు

ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాలకు వైద్యం ప్రశ్నార్థకంగా మారింది. వైద్యులు వారాల తరబడి పోటాపోటీగా సెలవులు పెట్టడం, విధులకు హాజరైన రోజుల్లో కూడా సరిగా వైద్య సేవలు అందించకపోవడంతో మూగ జీవాల ఆరోగ్యం అగమ్యగోచరంలో పడింది. ఇటీవల ఇక్కడ శివంగి(ఆడ సింహం)కి పుట్టిన రెండు పిల్లలు మృత్యువాత పడ్డాయి. జూ పార్కుల్లో సింహాలకు పిల్లలు పుట్టడం దేశంలో ఇదే మొదటిసారి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన జూ వైద్యులు నిర్లక్ష్యం కారణంగా.. పుట్టిన రెండు సింహం పిల్లల్లో ఒకటి రెండు రోజుల వయసులో, మరొకటి 12 రోజుల వయసులో ప్రాణాలు కోల్పోయాయి. ఏడాదిన్నర క్రితం ఇక్కడ జిరాఫీ పిల్ల తల్లి కడుపులోనే మరణించిన విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చిన పలు అరుదైన వన్యప్రాణులు సైతం సరైన వైద్యం అందకపోవంతో మృత్యువాత పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లాంగ్‌ లీవ్‌లో డాక్టర్‌ శ్రీనివాస్‌

జూ పార్కు ఏర్పాటైనప్పటి నుంచి పశు సంవర్ధక శాఖకు చెందిన డాక్టర్‌ శ్రీనివాస్‌ ఇక్కడి మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కారణాలతో రెండేళ్ల క్రితం లాంగ్‌(ఐదేళ్ల) లీవ్‌ పెట్టారు. అప్పటి నుంచి పరిస్థితులు దిగజారాయి. ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు వైద్యులున్నారు. వారిలో నెల క్రితం నియమించిన పశు సంవర్ధక శాఖకు చెందిన ప్రభుత్వ వైద్యుడున్నారు. మిగిలిన ఇద్దరు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారిలో ఒక యువ వైద్యుడు ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు హైదరాబాద్‌లో సొంతంగా వెటర్నరీ మందుల సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచే గతంలో అవసరానికి మించి మందులు కొనుగోలు చేయించేవారని సమాచారం. సదరు వైద్యుడు నెలలో సగం రోజులు సిక్‌ లీవ్‌ల పేరిట జూ డ్యూటీకి ఎగనామం పెడుతున్నారు. మరో మహిళా వైద్యురాలు నాలుగు నెలల క్రితం జూలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో చేరారు. ఆమె గతంలో కొన్నాళ్లు ఇక్కడ వైద్యురాలిగా పనిచేశారు. ఇక్కడ మానేసిన తర్వాత జీవీఎంసీ మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లు జూ సిబ్బంది చెప్తున్నారు. అక్కడో వారం.. ఇక్కడో వారం అన్నట్లుగా ఆమె సేవలందిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరు డ్యూటీకి వెళ్లిన రోజుల్లో కూడా వన్యప్రాణులను సరిగా పరిశీలించట్లేదని యానిమల్‌ కీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే గర్భం దాల్చిన సింహానికి సరైన వైద్యం, అవసరమైన మందులు అందక నీరసించిన పిల్లలు పుట్టాయన్న ఆరోపణలున్నాయి. వీరిద్దరు ఇటీవల నియమించిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడికి కూడా సహకరించకుండా సెలవుల్లో గడుపుతున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా అటవీశాఖ సీఎఫ్‌, జూ ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement