ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా డాక్టర్ జి.సలీం పురుషోత్తమన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన ఎ.కె.సక్సేనా మొయిల్‌కు ఎండీగా వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. మెకానికల్ ఇంజనీర్ అయిన సలీం 1988లో బొకారోలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1996లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో చేరారు. సర్టిఫైడ్ ఎనర్జీ మేనేజర్‌గా స్టీల్‌ప్లాంట్ ఐఎస్‌ఓ 50001 సర్టిఫికేషన్ పొందడంలో ఆయన గణనీయంగా దోహదపడ్డారు. 2018లో ఆయన బ్రైత్ వైట్ అండ్ కంపెనీ లిమిటెడ్‌లో డైరెక్టర్ (ప్రొడక్షన్)గా చేరారు. అక్కడ ఒక ఏడాది పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా బాధ్యతలు నిర్వహించారు. మూడు నెలల పాటు అక్కడ సీఎండీగా వ్యవహరించారు. 2024లో మలేషియాలోని లింకన్ యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పొందారు.