అనకాపల్లిటౌన్ : దారిదోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్టు పట్టణ సీఐ దాడి మోహనరావు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన రెవెన్యూ ఉద్యోగి కారక అప్పలనాయుడు, ఫొటోగ్రాఫర్ నాలం ప్రసాద్ రాజమండ్రి నుంచి ఆనందపురం వెళ్లేందుకు బస్సులో ప్రయాణిస్తూ నిద్రలోకి జారుకున్నారు. దీంతో బస్సు స్థానిక బస్టాండ్‌కు చేరుకుంది. వారిద్దరూ అక్కడి నుంచి హైవేకు వెళ్తుండగా మార్గంమధ్యలో అప్పలనాయుడు, ప్రసాద్‌లను తాము పోలీసులమంటూ పట్టణానికి చెందిన పొలిమేర సతీష్, నెల్లి జానీబాయ్‌లు శనివారం రాత్రి అడ్డుకొని రూ.25,200 నగదుతోపాటు రెండు సెల్‌ఫోన్లను తీసుకుపోయారు. అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. ఆదివారం సతీష్, జానీబాయ్‌లను అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా పై విధంగా రిమాండ్ విధించినట్టు సీఐ చెప్పారు.