
ముడసర్లోవలో ఉద్యానవనం అందాలు
వాస్తవానికి గతంలో జీ–20 సమావేశాల సందర్భంగా వచ్చిన ప్రపంచదేశాల అతిథుల బృందం ముడసర్లోవలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంటు (ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్)ను పరిశీలించారు. ఇప్పటికే ముడసర్లోవ వివిధ రకాలుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ రిజర్వాయర్ మొత్తం 62 ఎకరాల్లో విస్తరించి ఉంది. నగర ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు నిరంతరం ప్రయత్నించడంలో భాగంగా దాల్ లేక్ తరహాలో ముడసర్లోవ లేక్‌ను అభివృద్ధి చేయాలని జీవీఎంసీ మేయర్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఇంజినీర్స్ డే సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా రిజర్వాయర్ ఎంత లోతులో ఉన్నది? బోటింగ్ సమయంలో పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఎక్కడెక్కడ సేదతీరేందుకు షాపింగ్, హోటల్స్ వంటి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది? అనే అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించాలని సూచించారు.