
● అన్ని ఆర్జిత సేవలు రద్దు ● రాత్రి 7 గంటల వరకు మాత్రమే దర్శనాలు
సింహాచలం : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు శుక్రవారం తెలిపారు. ఏడాదంతా స్వామికి జరిగే నిత్య సేవలు, విశేష సేవలు, ప్రముఖ ఉత్సవాల రోజుల్లో వైదికపరంగా ఏమైనా దోషాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు పవిత్రోత్సవాలను నిర్వహించడం పరిపాటిగా వస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా 24వ తేదీ రాత్రి 7గంటల తర్వాత మృత్యం గ్రహణం, అంకురార్పణం, హోమాలు, 25వతేదీ ఉదయం విశేష హోమాలు, పారాయణాలు, రాత్రి ఆధివాసములు, పారాయణాలు, 26వ తేదీ రాత్రి పవిత్ర సమర్పణ, 27 ఉదయం విశేషహోమాలు, రాత్రి పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి, 28 ఉదయం ఏకాంత స్నపనం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేంపజేసి వేద పారాయణలు, దివ్యప్రబంధ సేవాకాలం, తిరువీధి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఈనెల 24వ తేదీ నుంచి 28వతేదీ వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈనెల 24నుంచి 28వరకు రాత్రి 7గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాలు ఉంటాయని చెప్పారు.