గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

సమీక్ష నిర్వహిస్తున్న ఈవో త్రినాథరావు  - Sakshi

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో జూలై 2వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ, 3న జరిగే ఆలయ ప్రదక్షిణ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణలకు సంబంధించి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు, సెక్షన్‌ విభాగాల అధికారులతో ఈవో ముందస్తు సమీక్ష శుక్రవారం సింహగిరిపై నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో గిరిప్రదక్షిణ ఉత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వివిధ అంశాలపై అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో చర్చించారు. ముఖ్యంగా ఆరోజు 32కిలోమీటర్ల మేర భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న స్టాల్స్‌, పుష్పరథం, ఆలయానికి పుష్పాలంకరణ, మంచినీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, ఉచిత ప్రసాద వితరణ, అన్నప్రసాద భవనంలో భక్తులకు భోజనం, సింహగిరిపై క్యూలైన్లు ఏర్పాటు, తొలిపావంచా వద్ద ఏర్పాట్లు, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రధాన పురోహితులు శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు రాజగోపాల్‌, ట్రస్ట్‌బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, పిల్లా జగన్‌మోహన్‌ పాత్రుడు, శ్రీదేవి వర్మ, సాయు నిర్మల, ముందుడి రాజేశ్వరి, బయ్యవరపు రాధ, దశమంతుల రామలక్ష్మి, దొడ్డి రమణ, దేవస్థానం డిప్యూటీ ఈవొ సుజాత, ఇంజనీరింగ్‌ అధికారులు శ్రీనివాసరాజు, రాంబాబు, నాగేశ్వరరావు, హరి, ఏఈవొలు ఆనంద్‌కుమార్‌, ఇజిరోతు శ్రీనివాసరావు, జంగం శ్రీనివాస్‌, నరసింహరాజు, సూపరింటిండెంట్‌ పాలూరి నరసింగరావు పాల్గొన్నారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top