జ్ఞాపకాలు పదిలం..

మణికంఠ అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజలు   (ఇన్‌సెట్‌) మళ్ల వెంకట మణికంఠ (ఫైల్‌) 
 - Sakshi

● బ్రెయిన్‌డెడ్‌ యువకుడి అవయవాలు దానం ● ఆదర్శంగా నిలిచిన తల్లిదండ్రులు

యలమంచిలి : అందివచ్చిన కొడుకు అర్ధంతరంగా మరణిస్తే ఆ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతారు. ఆ కష్టాన్ని ఎవరూ తీర్చలేరు. అయినప్పటికీ పుట్టెడు దు:ఖంలో కూడా తమ కుమారుడి జ్ఞాపకాలు పదిలం చేసుకోవడానికి.. అతని కదలికలను సజీవంగా ఉంచేందుకు ఆ తల్లిదండ్రులు ఉదాత్తమైన నిర్ణయం తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి కొత్తపాలెం గ్రామానికి చెందిన మళ్ల వెంకట మణికంఠ (20) రెండు రోజుల క్రితం సీలేరు ధారాలమ్మ గుడికి బంధువులతో వెళ్లి తిరిగి వస్తుండగా తాళ్లపాలెం సమీపంలో తాను ప్రయాణిస్తున్న టాటా ఏస్‌ వాహనం నుండి జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మళ్ల వెంకట మణికంఠను కుటుంబ సభ్యులు విశాఖపట్నం కింగ్స్‌ ఐడియల్‌ ఆస్పత్రి (డెయిరీ ఆస్పత్రి)లో చేర్పించారు. ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగలడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయారు. ఈ దశలో ధైర్యం కూడదీసుకున్న అతని తల్లిదండ్రులు మళ్ల కృష్ణ, పోలేరమ్మ కుమారుడి అవయవాలను అవసరమైన వారికి దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో డాక్టర్లు జీవనధారకు అతని అవయవాలు డొనేట్‌ చేశారు. మృతుడు వెంకట మణికంఠకు ఒక సోదరి ఉంది. అతను యలమంచిలి పూర్ణసాయి వివేకానంద కళాశాలలో బీఎస్సీ కెమిస్ట్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మణికంఠ తల్లి వికలాంగురాలు. తండ్రి వ్యవసాయ కూలీ. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం పుట్టెడు దు:ఖంలో మునిగిపోయింది. మణికంఠ మరణవార్త విన్న స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మణికంఠ అంతిమ యాత్రను దిమిలి రోడ్డు జంక్షన్‌ నుంచి బైక్‌ ర్యాలీతో కొత్తపాలెం గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లి సంతాపం వ్యక్తం చేశారు.

ప్రముఖుల పరామర్శ

అవయవదానం చేసిన మళ్ల వెంకట మణికంఠకు యలమంచిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ తోట కృష్ణవేణి, యలమంచిలి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ గఫూర్‌, పట్టణ ఎస్‌ఐ పాపినాయుడు, కౌన్సిలర్లు రాపేటి సంతోష్‌, మరిణేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పల్లా శ్రీనివాసరావు తదితరులు నివాళులు అర్పించారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top