
పెరిగిన ఉష్ణోగ్రతలతో జనసంచారం లేక నిర్మానుష్యంగా మారిన చోడవరం మెయిన్‌రోడ్డు
అనకాపల్లి రూరల్/చోడవరం: రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా అంతటా శుక్రవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా 4.5 డిగ్రీలు పెరగడంతో జనం వడగాడ్పులతో అల్లాడిపోయారు. చోడవరంలో 43 డిగ్రీలు, అనకాపల్లిలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రోళ్లు పగులుతున్నాయ్!
రోహిణీ కార్తెలో రోళ్లు సైతం పగులుతాయన్న నానుడి నిజం చేస్తూ ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అత్యవసర పనులకు సైతం బయట తిరగాలంటే ప్రజలు భయపడుతున్నారు. జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో గడచిన మూడేళ్లతో పోల్చుకుంటే ఈసారి అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్టు నివేదికలు చెప్తుస్తున్నాయి. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఇదే సమయంలో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలో పలుచోట్ల చలివేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచి మజ్జిగ, తాగునీరు వంటివి సరఫరా చేస్తున్నారు.
వ్యాపారాలు పాక్షిక బంద్
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నా వేడి గాలి రావడంతో ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నెత్తిపై తట్ట పెట్టుకుని ఇంటింటికీ తిరిగే వ్యాపారులపై ఎండల ప్రభావం అధికంగా పడింది. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతో వ్యాపారం చెసుకోలేని పరిస్థితి. కొందరు పొట్టకూటి కోసం మండుటెండలోనే వ్యాపారం చేసుకుంటుండగా, ఎక్కువశాతం మంది ఉదయం 11 తర్వాత రోడ్లపై కనిపించడంలేదు. తమ వ్యాపారాలకు పాక్షిక బంద్ ప్రకటిస్తున్నారు. సాయత్రం 5 గంటల తర్వాతే మళ్లీ వ్యాపారం మొదలెడుతున్నారు. ఉపాధిహామీ పనులకు వెళ్లే ప్రజలు, వ్యవసాయ కూలీలు, మైనింగ్ కార్మికులు ఉదయం 11 గంటల నుంచి ఇంటి బాట పట్టేలా, మైనింగ్ పరిశ్రమల్లో పగలు డ్యూటీలను సైతం యజమానులు రద్దు చేశారు.
ద్రవ పదార్థాలతో కాస్త ఉపశమనం
వేసవికాలం ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోతే వారికి ఎట్టి పరిస్థితుల్లో నీటిని ఇవ్వరాదు. వృద్ధులు, చిన్న పిల్లలు, గుండె వ్యాధి బాధితులు, సుగర్, కిడ్నీ బాధితులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
– ఎన్.వాణీజగదీశ్వరి, వైద్యురాలు,
తుమ్మపాల పీహెచ్‌సీ
భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
చోడవరంలో 43 డిగ్రీలు,
అనకాపల్లిలో 40.8 డిగ్రీలు నమోదు
ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత

నిత్యం రద్దీగా ఉండే అనకాపల్లి నెహ్రూచౌక్ కూడలి ఇలా..
