జిల్లా కేంద్రంగా ఎదిగిన పాడేరుపట్టణంలో అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. ప్రధాన రహదారుల విస్తరణపై గత రెండేళ్లుగా ఊరిస్తున్న రూ.44 కోట్ల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడంతో, స్థానికులు నిత్యం ట్రాఫిక్ కష్టాలతోసతమతమవుతున్నారు.
కాగితాలకే పరిమితమైన పాడేరు మెయిన్ రోడ్డు పనులు
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో రోడ్ల విస్తరణ కలగానే మిగిలిపోయింది. గత రెండేళ్లుగా రూ.44 కోట్ల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రం ఏర్పడిన నాటి నుంచి గత నాలుగేళ్లలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ, అందుకు అనుగుణంగా రోడ్ల అభివృద్ధి మాత్రం జరగలేదు.
రోడ్డును ఆక్రమించిన దుకాణాలు
పాడేరు పాత బస్టాండ్ నుంచి సినిమా హాల్ సెంటర్ మీదుగా తలారిసింగి వరకు, అలాగే పాత బస్టాండ్ నుంచి సుండ్రుపుట్టు సాయిబాబా టెంపుల్ వరకు రెండు ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లకు ఆనుకుని వ్యాపారులు అక్రమంగా దుకాణాలను నిర్మించుకున్నారు. వీటిని వెనక్కి జరుపుకోవాలని రెవెన్యూ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఎలాంటి ఫలితం లేదు. ముఖ్యంగా శుక్రవారం వారపు సంత రోజున దుకాణాలన్నీ ప్రధాన రహదారిపైకి రావడంతో, వాహనదారులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రహసనంగా మారిన రోడ్డు అభివృద్ధి
గతంలో ఆర్‌అండ్‌బీ శాఖ నిర్మించిన కాలువల వరకు రోడ్డును విస్తరిస్తామన్న ప్రచారం మాటలకే పరిమితమైంది. ప్రస్తుతం రోడ్డుకు, కాలువకు మధ్య సుమారు 20 మీటర్ల వరకు ఖాళీ స్థలం ఉన్నప్పటికీ, ఆ మేర రోడ్డును వెడల్పు చేయాలనే ప్రజల విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోవడం లేదు.
నిత్యం ట్రాఫిక్ కష్టాలు
పాడేరు పట్టణంలో వాహనాల రద్దీ పెరగడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సినిమా హాల్ సెంటర్ వద్ద ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా 108, 104 అంబులెన్స్‌లతో పాటు, కలెక్టర్, జేసీ, ఎస్పీ, ఐటీడీఏ పీవో వంటి ఉన్నతాధికారుల వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పెద్ద వాహనాలను రోడ్లపైనే నిలిపివేయడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. ప్రధాన బజార్ రోడ్డులో కూడా ఇదే దుస్థితి కొనసాగుతోంది. పోలీసుల హెచ్చరికలను వాహన చోదకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ముఖ్యంగా ఇదే రహదారిపై జిల్లా ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. అంబులెన్స్‌లు అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో ట్రాఫిక్ జాం కావడంతో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రోడ్లపై ప్రయాణించే అధికారులు సైతం ట్రాఫిక్ ఇబ్బందులను గమనిస్తున్నా, పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రం పాడేరులోరోడ్ల అభివృద్ధికి గ్రహణం
రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం
నిత్యం ట్రాఫిక్ సమస్యలతోప్రజల ఇబ్బందులు
పరిష్కారంపై దృష్టి పెట్టనికూటమి ప్రభుత్వం
రోడ్ల్ల విస్తరణతో అభివృద్ధి
పట్టణంలోని అన్ని రోడ్లు వెడల్పుగా విస్తరించి అభివృద్ధి చేయాలి. వాహన చోదకులతో పాటు పాదచారులు ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అనేకసార్లు రోడ్డు విస్తరణ అంటూ మార్కింగ్ వేసినా పనులు మాత్రం జరగకపోవడం అన్యాయం.
– రామారావుదొర, జిల్లా అధ్యక్షుడు,
ఆదివాసీ జేఏసీ, పాడేరు
ట్రాఫిక్ సమస్య పెరిగింది
రోడ్డుకు ఇరువైపులా ఉ న్న కాల్వల వరకు అయిన అత్యవసరంగా రోడ్డు అభివృద్ధి చేయాలి. ట్రాఫిక్ సమస్య అఽధికమైంది. సంత రోజున మరింత ఇబ్బందిగా మారింది. సినిమాహల్ సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో రోడ్డుమీదే వాహనాలు నిలిపివేతపై చర్య లు తీసుకోవాలి. – బి.సుందరరావు,
గిరిజన సంఘ నేత, పాడేరు
నిధులు మంజూరైనవెంటనే పనులు
పాడేరు పట్టణంలోని అన్ని ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.గతంలో రూ.44కోట్ల ప్రతిపాదనల వివరాలను మళ్లీ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళతాం. నిధులు మంజూరు అయిన వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపడతాం.
– సాగర్, ఈఈ, ఆర్‌అండ్‌బీ, పాడేరు


