సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

జిల్లా కలెక్టర్‌ నిశాంతి

పాడేరు: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో భాగంగా అర్జీదారుల నుంచి స్వీకరించే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ఆర్డీవో భుజంగరావులతో కలిసి 94 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని, కార్యక్రమం పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనివార్య కారణాల వల్ల హాజరు కాలేని అధికారులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు గైర్హాజరయ్యే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీదారులు మీకోసం కాల్‌ సెంటర్‌ (1100) సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే ఫిర్యాదులపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రజల నుండి నేరుగా అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా భూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్‌, డీఆర్డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీరామ్‌ పడాల్‌, జిల్లా పరిశ్రమల అధికారి రమణరావు, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి ప్రసాద్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement