బూదరాళ్ల పాఠశాలలో ఎంఈవో విచారణ | - | Sakshi
Sakshi News home page

బూదరాళ్ల పాఠశాలలో ఎంఈవో విచారణ

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

కొయ్యూరు: బూదరాళ్ల మండల పరిషత్‌ పాఠశాలలో బోధన సరిగా జరగడం లేదని వస్తున్న ఆరోపణలపై ఎంఈవో పి. సింహాచలం శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గణేష్‌ బోధన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొద్ది రోజుల క్రితం స్థానికులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పాఠశాలను మూసివేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ఫిర్యాదు మేరకు పాఠశాలను సందర్శించిన ఎంఈవో, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయుడు గణేష్‌ తీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, 40 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆయనను వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు.

కంఠారం ఉపాధ్యాయుడికి డిప్యూటేషన్‌

చక్కని బోధనా నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయునిగా పేరున్న రేవళ్లు పంచాయతీ, ఆర్‌. కంఠారం పాఠశాల ఉపాధ్యాయుడు సత్యనారాయణను గ్రామస్తుల అభ్యర్థన మేరకు బూదరాళ్లకు డిప్యూటేషన్‌పై పంపాలని నిర్ణయించారు. గ్రామస్తుల కోరిక మేరకు, సత్యనారాయణ కూడా డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించేందుకు అంగీకరించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. సోమవారం నుంచి ఆయన బూదరాళ్ల పాఠశాలలో విధులు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే, బోధన సరిగా చేయడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు గణేష్‌, అనారోగ్య కారణాల దృష్ట్యా సెలవుపై వెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement