చింతపల్లి: కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందునే, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదని ఎంపీపీ అనూషదేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య స్పష్టం చేశారు. శుక్రవారం చింతపల్లిలో వారు విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అసెంబ్లీకి హాజరవుతారని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, అత్యధిక సీట్లు సాధించిన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉందని వారు గుర్తు చేశారు. ఆ హోదా కల్పించనప్పుడు అసెంబ్లీకి వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదని వారు పేర్కొన్నారు. తరచూ టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చేస్తున్న విమర్శలను వారు తప్పుబట్టారు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పలేని గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యేలపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుపై వ్యక్తిగత దూషణలకు దిగడం మానుకోవాలని వారు హితవు పలికారు. అధికారంలోకి వస్తే జీవో నం. 3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి, నేడు ఆ ఊసెత్తకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు ఎందుకు అప్పగిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు.
చింతపల్లి ఎంపీపీ అనూషదేవి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య


