ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారుల నుంచి సానుకూల స్పందన లభించింది. ‘మృత్యువుతో నిత్య పోరాటం, ..కుమ్మరిపుట్టు వద్ద నోచుకోని వంతెన, సర్వేలతో కాలయాపన, ఇప్పటివరకు 91 మంది గిరిజనుల బలి.. అనే అంశాలతో ప్రచురించిన ప్రత్యేక కథనంపై ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు కుమ్మరిపుట్టు వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు మాజీ సర్పంచ్ రమేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలిసి మత్స్యగెడ్డను పరిశీలించారు. వంతెన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి, గెడ్డకు ఇరువైపులా వెడల్పు, ఎత్తు, పొడవు తదితర కొలతలను సేకరించారు. నాయకులు జగత్‌రాయ్, శ్రావణ్, చిన్నిబాబు, రామారావు, సతీష్, ప్రభాకర్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


