మానస్‌ మేథస్సుకు యాపిల్‌ సలాం | - | Sakshi
Sakshi News home page

మానస్‌ మేథస్సుకు యాపిల్‌ సలాం

May 20 2026 2:16 AM | Updated on May 20 2026 2:16 AM

యాపిల్‌ గ్లోబల్‌ ఛాలెంజ్‌లో విశాఖ కుర్రాడి ఘనత ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న టాప్‌–15 ఎలైట్‌ గ్రూప్‌లో చోటు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేలా ‘స్టెమ్‌ క్వెస్ట్‌’ యాప్‌ రూపకల్పన

కొమ్మాది: టెక్‌ దిగ్గజం యాపిల్‌ నిర్వహించిన స్విఫ్ట్‌ స్టూడెంట్‌ ఛాలెంజ్‌–2026లో విశాఖ సీతమ్మధారకు చెందన యువకుడు మానస్‌ మల్లా అద్భుత విజయం సాధించారు. జూన్‌ 9న ఆయన యాపిల్‌ సీఈవో టీమ్‌ కుక్‌ను కలవనున్నారు. ఈ ఛాలెంజ్‌ను క్రాక్‌ చేసిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్‌ 15 మంది విద్యార్థుల్లో ఈయన ఒకరు. ఈ 15 మంది ఎలైట్‌ బృందంలో స్థానం దక్కించుకున్న ఏకై క భారతీయుడు కావడం, విశాఖ యువకుడు కావడం విశేషం. విశాఖలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న మల్లా మానస్‌ రూపొందించిన ఆఫ్‌లైన్‌ ఏఆర్‌ ఆధారిత పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌ యాప్‌ స్టెమ్‌ క్వెస్ట్‌ ఆయనకు ఆపిల్‌ పార్కులో జరిగే వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫిరెన్స్‌ను సందర్శించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అక్కడ ఆయన టీమ్‌ కుక్‌తో ముఖాముఖి ఇంటరాక్ట్‌ అవుతారు. స్టెమ్‌ క్వెస్ట్‌ విద్యార్థులకు స్నేహపూర్వక, సహాయక ట్యూటర్‌గా పనిచేసేలా రూపొందించబడింది. బట్టి పట్టే విధానంతో తాను పడిన ఇబ్బందులు, భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని గమనించిన మల్లా, సాధారణ క్విజ్‌లకు బదులుగా విద్యార్థులు భావోద్వేగాలను నేర్చుకునే విధానాలను బాగా అర్ధం చేసుకోవడానికి ఏఐ ఆధారిత కథలు చెప్పేవిధానాన్ని, ఫేషియల్‌ ట్రాకింగ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. మాతృభాషలు, ప్రాంతీయ మాండలీకాలు అందరికి అందుబాటులో ఉండే సాంకేతికతను ఉపయోగించి అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా, కలుపుకుపోయేలా, ఒత్తిడి లేకుండా చేయడం ఈ యాప్‌ ఉద్దేశం.

ప్రధానికి వివరించిన మానస్‌

న్యూఢిల్లీలో జరిగిన స్టార్టప్‌ మహాకుంభ్‌లో మల్లాకు తన లెర్నింగ్‌ యాప్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచనకు తగిన ప్రోత్సాహం లభించింది. అక్కడ ఆయన ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో స్టెమ్‌ క్వెస్ట్‌ గురించి తన విజన్‌ పంచుకోగా, ఆ కలను సాకారం చేసుకోవాలని ప్రధాని ఆయనను ప్రోత్సహించారు. ఫిబ్రవరిలో, యాపిల్‌ ఛాలెంజ్‌ గడువు ముగియడానికి కేవలం ఒక వారం ముందు మల్లా తన ఆలోచనలను డిజిటల్‌–ఫస్ట్‌ అప్లికేషన్‌గా మార్చారు. ఈ కొత్త వెర్షన్‌ స్టెమ్‌ క్వెస్ట్‌గా రూపాంతరం చెందింది. ఇది సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ను బోధించే యానిమేటెడ్‌ ట్యూటర్లతో వీడియో కాల్‌లాగా డిజైన్‌ చేయబడిన ఆఫ్‌లైన్‌ ఏఐ విధ్యా ఫ్లాట్‌ఫారమ్‌. విద్యార్థులు తమకు కావాల్సిన టాపిక్‌ ఎంచుకుని స్నేహపూర్వక వర్చువల్‌ మెంటర్‌తో ఇంటరాక్ట్‌ కావచ్చు. ఇది ఒత్తిడితో కూడిన క్లాస్‌రూమ్‌లో కూర్చోవడానికి బదులుగా ఒక స్నేహితుడుతో మాట్లాడుతున్న అనుభూతిని ఇస్తుంది. యాప్‌ అతి పెద్ద బలం సానుభూతితో కూడిన అభ్యాసం. ‘సాధారణ పరీక్షలు, క్విజ్‌లపై ఆధారపడే బదులు ఫేషియల్‌ ట్రాకింగ్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ ఫీచర్ల ద్వారా విద్యార్థి గందరగోళంగా ఉన్నాడా.. ఆసక్తిగా ఉన్నాడా.. సంతోషంగా ఉన్నాడా.. విసుగు చెందాడా అనే విషయాలను అర్ధం చేసుకోవడానికి ఈ ఫ్లాట్‌ఫారమ్‌ ప్రయత్నిస్తుందని’ మల్లా తెలిపారు. వ్యక్తిగతీకరణ అనేది దీని మరొక ముఖ్య లక్షణం. స్టెమ్‌ క్వెస్ట్‌ విద్యార్థుల హాబీలు, ఆసక్తులను ఉపయోగించి కాన్సెప్ట్‌లను వివరిస్తుంది. ఆన్‌–డివైజ్‌ ఏఐ జనరేటెడ్‌ విజువల్స్‌, స్టోరీ టెల్లింగ్‌ ద్వారా విద్యార్థులకు అభ్యాసాన్ని మరింత ఆకర్షనీయంగా, ఇంటరేక్వివ్‌గా, భయం లేకుండా చేస్తుందని ఆయన చెబుతున్నాడు.

ఆవేదన నుంచి వచ్చిన ఆలోచన

నేను అమెరికాలో చదివినప్పుడు ప్రయోగాల ద్వారా నేర్చుకునే విద్యా విధానాన్ని చూశాను. కానీ భారతదేశం తిరిగి వచ్చి ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పుడు విద్యార్థులపై ఉన్న విద్యా ఒత్తిడిని గమనించాను. ఐఐటీ ఫలితాల వల్ల నా మిత్రుడు ఆత్మహత్యకు యత్నించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటనలతో మన విద్యావ్యవస్థలో మానవతా దృక్పథం అవసరమని గుర్తించి, ఒత్తిడి లేని అభ్యాసం కోసం ‘స్టెమ్‌ క్వెస్ట్‌’ యాప్‌ను రూపొందించాను. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఇందులో వాయిస్‌ ఇంటరాక్షన్‌, హై–కాంట్రాస్ట్‌ ఫీచర్లు చేర్చాను. ఇంటర్నెట్‌, ఖరీదైన ఫోన్లు లేని పేద విద్యార్థుల కోసం ఇది ఆఫ్‌లైన్‌లో, తక్కువ ధర స్మార్ట్‌ఫోన్లలో కూడా స్థానిక భాషల్లో పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణకు గాను నాకు అమెరికాలోని యాపిల్‌ పార్క్‌ను సందర్శించి, అక్కడి ఇంజనీర్లతో చర్చించే అవకాశం, ఏడాది పాటు ఉచిత యాపిల్‌ డెవలపర్‌ మెంబర్‌షిప్‌ లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement