సబ్బవరం: విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకుల విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లతోపాటు నాన్ టీచింగ్ సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం రాష్ట్రంలోనే తొలిసారిగా స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. విశాఖపట్నం–అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త(డీసీవో) జి.గ్రేస్ మాట్లాడుతూ ఇలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల అవసరాలు మరింత మెరుగ్గా తీర్చడంతోపాటు, పరిపాలనా విధుల్లో సమర్ధత పెంపొందించుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, విద్యాసంస్థల పరిపాలనను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. శిక్షణలో భాగంగా కార్యాలయ నిర్వహణ, ఫైల్ మెయింటెనెన్స్, ఈ ఆఫీస్ విధానం, రికార్డుల సంరక్షణ, సమయపాలన, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రభుత్వ ఉత్తర్వుల అమలు, డిజిటల్ సేవల వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రిన్సిపాళ్లు ఎస్.రామకృష్ణ, పి.శ్రీనివాసరావు, రత్నవల్లి, మృదుల ప్రియదర్శిని, ఉషారాణి, సత్యవతి, పద్మకుమారి, రాజేశ్వరి, ఎం.కోటేశ్వరరావుతోపాటు సూపరింటెండెంట్‌లు ఎస్. శ్రీనివాసరావు, నరేష్, రాజేష్, అనిత పాల్గొన్నారు.


