పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై
రాంబిల్లి(అచ్యుతాపురం): సామాన్యుల నడ్డివిరిచే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని, విచక్షణా రహితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అఽఽధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో మంగళవారం రాంబిల్లి మండలం మామిడివాడలో పార్టీ కార్యాలయం నుంచి కొత్తూరు పెట్రోల్ బంక్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలోని కీలక నేతలు గత ప్రభుత్వ హయాంలో చేసిన విమర్శలను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల ప్రభావం అన్ని వర్గాలపై, అన్ని రంగాలపై పడుతుందన్నారు. నిత్యావసర ధరలు సైతం అమాంతం పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం గురించి పరితపించే నేతలు ప్రస్తుత ప్రభుత్వంలో కరువయ్యారని విమర్శించారు. మీడియా పరంగా హంగూ ఆర్భాటాలు చేసే కూటమి నేతలు ధరల పెంపుపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ వద్ద లీటర్ ధర ఎంత పెరిగిందని బంక్ ప్రతినిధులు, సామాన్యులతో ధర్మశ్రీ మాట్లాడారు. బంక్‌లోని ధరల పట్టికను పరిశీలించారు. పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయండి...
అంతకు ముందు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నేతలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రతినిధులతో ధర్మశ్రీ సమావేశమయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నాలుగు మండలాల్లో పార్టీ, అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని ఆయా మండలాల బాధ్యులకు సూచించారు. పోరాటాల ద్వారానే ప్రజల మన్ననలు పొందగలరని ఉద్బోధించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు, రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు, ఎంపీపీ భర్త శ్రీనుబాబు, రాంబిల్లి, యలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక మండలాల అధ్యక్షులు కిశోర్, బొద్దపు ఎర్రయ్యదొర, దేశంశెట్టి శంకర్‌రావు, ఆడారి అచ్చింనాయుడు, నాలుగు మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.


