బీచ్‌రోడ్డు: ‘రేడియో కేవలం వినోద మాధ్యమం కాదు.. అది విజ్ఞానం, క్రమశిక్షణ, జీవిత విలువలను అందించే గొప్ప వేదిక’ అని విశాఖ జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి పేర్కొన్నారు. 90 వసంతాల ఆకాశవాణి ఉత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన వాక్‌థాన్‌ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తాను రేడియో వింటూ పెరిగానని, రేడియో ద్వారా విజ్ఞానం, వినోదం రెండింటినీ పొందానని చెప్పారు.
‘మా అమ్మతో పాటు మా కుటుంబమంతా రేడియో అభిమానులమే. జీవితాలను ఉన్నతంగా మలచే శక్తి రేడియోకు ఉంది’ అని ఆమె అన్నారు. ఈ ప్రత్యేక వేడుకల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, రీజినల్ ఛానెల్ మేనేజర్ ఆర్. హర్షలత మాట్లాడుతూ తన 32 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆకాశవాణి 90వ వార్షికోత్సవాలను నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమాజానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన రేడియో తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోందన్నారు.
డైరెక్టర్ ఇంజనీరింగ్ జె.కృష్ణారావు, డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీరింగ్ బి.వేణు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల నాటికి మరింత నాణ్యమైన కార్యక్రమాలతో శ్రోతలకు చేరువ కావడమే లక్ష్యమన్నారు. కార్యక్రమ విభాగాధిపతి పి.వి.రాంగోపాల్ మాట్లాడుతూ విభిన్న కార్యక్రమాల రూపకల్పనతో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్నో వేలాది మంది శ్రోతల అభిమానాన్ని సంపాదించుకుందని చెప్పారు.
సిరిపురంలోని ఆకాశవాణి కేంద్రం వద్ద ప్రారంభమైన వాక్‌థాన్ పాండురంగపురం, బీచ్‌రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం, రామకృష్ణ మిషన్ మీదుగా సాగి తిరిగి కేంద్రం వద్ద ముగిసింది. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ కె. ఇందిర, సంఘమిత్ర, ఎన్. సుధాకరరెడ్డి, తేతలి దిలీప్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


