మాకవరపాలెం: కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు జి.వామనమార్తి ఆరోపించారు. మంగళవారం మాకవరపాలెంలో ఆటో కార్మికులతో కలసి ఆయన మాట్లాడారు. 2014లో ఎన్నో హామీల్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 36 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందన్నారు. విదేశాల్లో నల్లధనాన్ని వెలికితీసి పేదల అకౌంట్లలోకి వేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని బూచిగా చూపి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిందని ఆరోపించారు. ఈ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదానీ, అంబానీ వంటి వారిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా సామాన్యులపై భారం మోపడం సరికాదన్నారు. ఆటో, మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు వీరికి భారంగా ఉన్న జీవోలను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు రవి, కృష్ణ, దేవరాజు, దేవుడు, స్థానిక ఆటో యూనియన్ సభ్యులు శేషు, సూరిబాబు, చిన్నబ్బాయి, తదితరులు పాల్గొన్నారు.


