జిల్లాలో తేలిక పాటి వర్షాలు పడే అవకాశం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో తేలిక పాటి వర్షాలు పడే అవకాశం

May 20 2026 2:16 AM | Updated on May 20 2026 2:16 AM

అనకాపల్లి టౌన్‌: జిల్లాలో వచ్చే ఐదు రోజులు తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్‌ డాక్టర్‌ సి.హెచ్‌. ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 36.8 నుంచి 37.9 డిగ్రీలుగా నమోదవుతాయన్నారు. ఈ మేరకు రైతులు చెరకు పైరుకు నీరు పెట్టాలన్నారు. చెరకులో కొరడా తెగులు ఆశిస్తే. ప్రోపికొనజోల్‌ 1 మి.లీ లేదా అజోక్సిస్ట్రోబిన్‌, టెబుకోనజోల్‌ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలన్నారు. నీటి వసతి ఉన్న రైతులు ముందస్తు ఖరీఫ్‌ పంటగా నువ్వులను వేసుకోవచ్చన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో పండు ఈగ ఆశించే అవకాశం ఉందన్నారు. ఇది ఆశించి రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలని, ఈగ నివారణకు ప్లాస్టిక్‌ పళ్లెంలో మిథైల్‌ యూజినాల్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి తోటలో వేలగట్టాలన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితుల బట్టి వేసవి జల్లులు కురిసిన తర్వాత ఖాళీ పొలాల్లో వేసవి దుక్కులు దున్నుకోవాలన్నారు. పంట కోత అనంతరం ఖాళీ పొలాల్లో మట్టి నమూనాలను సేకరించి విశ్లేషణ చేసినట్లయితే రాబోయే ఖరీఫ్‌లో భూసారం తగినట్టుగా యాజమాన్య పద్ధతులు చేపట్టవచ్చన్నారు. సమావేశంలో డాక్టర్‌ ఆదిలక్ష్మి, డాక్టర్‌ రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement