● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
● నిధుల కొరతపై సభ్యుల పెదవి విరుపు
● జెడ్పీ సభలో వాడీవేడి చర్చ
సాక్షి, అనకాపల్లి/మహారాణిపేట(విశాఖ): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, నిర్ణీత సమయంలో నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపించి ప్రజలకు భరోసా కల్పించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శనివారం విశాఖ జెడ్పీ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో మౌలిక వసతులను మరింత విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విభాగాల్లో సమస్యలు అధికంగా ఉండి, నిధులు మాత్రం శూన్యంగా ఉన్నాయని అధికారులు సభలో వెల్లడించడం చర్చనీయాంశమైంది. సభ్యులు అడిగిన ప్రతి అభివృద్ధి పనికి ‘నిధుల కొరత’అనే సమాధానమే వినిపించింది. చివరకు ఆర్‌అండ్‌బీ రోడ్ల గుంతలు పూడ్చేందుకు కూడా నిధుల్లేవని అధికారులు పేర్కొన్నారు. గిరిజన ప్రాంత వాసుల సౌకర్యార్థం మహాప్రస్థానం వాహనాల సేవలను విస్తరిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, దినేష్ కుమార్, జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి, జెడ్పీ సభ్యులు ఈర్లె అనురాధ, సామి సత్యనారాయణ, పైలా సన్యాసిరావు, దూలీ నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
● ఏజెన్సీ ప్రాంత జెడ్పీటీసీలు గంగరాజు, బొంజిబాబు, పోతల బాలయ్య, ఎంపీపీలు చేసిన విజ్ఞప్తి మేరకు కేజీహెచ్‌లో మాదిరిగానే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు చేసి అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని జెడ్పీ చైర్‌పర్సన్ కోరారు. పాడేరు నుంచి రిఫరల్ కేసులను కేజీహెచ్‌కు తీసుకొచ్చేందుకు అంబులెన్స్ సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మృతదేహాల తరలింపునకు సంబంధించి తగినన్ని మహా ప్రస్థానం వాహనాలను సమకూర్చాలని, గిరిజన ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు.
సమస్యలపై సభ్యుల ఏకరువు
● అల్లూరి జిల్లా డీఎంహెచ్‌వోను తక్షణం సరెండర్ చేయాలని సభ్యులు గంగరాజు, తదితరులు డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌వో సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, గిరిజన రోగుల బాగోగులు చూసుకోవడంలో డీఎంహెచ్‌వో విఫలమయ్యారని ఆరోపించారు.
● ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పాటించాలని, సోషల్ ఆడిట్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని సభ్యులు కర్రి సత్యం, ఈర్లె అనురాధ కోరారు. సభ్యులు లేవనెత్తిన అంశాలను సీరియస్‌గా తీసుకొని త్వరగా పరిష్కార చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ అధికారులను ఆదేశించారు.
15 అంబులెన్స్‌ల
కొనుగోలుకు ప్రతిపాదనలు
గిరిజన ప్రాంత ప్రజల సౌకర్యార్థం కేంద్ర సంస్థ నిధులతో కొత్తగా 15 అంబులెన్స్‌లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించామని, వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర సంస్థ నుంచి సుమారు కోటిన్నర వరకు ఆర్థిక సాయం అందుతుందని, వాటితో కొత్తవి కొనడంతో పాటు, పాత వాటికి మరమ్మతులు చేపడతామన్నారు. పాడేరు నుంచి కేజీహెచ్‌కు రిఫరల్ కేసుల తరలింపు, మృతదేహాల తరలింపులో ఉన్న సమస్యలను అధిగమిస్తామన్నారు.


