అరకులోయటౌన్: మన్యంలో ప్రస్తుతం ఇటుకల పండుగ సందడి నెలకొంది. అన్ని గిరిజన పల్లెల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. మండలంలోని పెదలబుడు, మాడగడ, గన్నెల, లోతేరు ముఠా పరిధిలోని గ్రామాల్లోని గిరిజనులు ఈ పండగ సందర్భంగా సందడి చేస్తున్నారు. రహదారులపై మహిళలు తాళ్లు, వెదురు గడలతో గేట్లను పెట్టి వాహనదారుల నుంచి నుంచి పండగ చందాలు(పజోరు) వసూలు చేస్తున్నారు. గిరిరైతులు వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు చేపట్టే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏజెన్సీలో ఏటా ఈ నెలలో ఇటుకల పండుగ చేసుకోవడం ఆచారం. ఉగాది పండుగనే మన్యంలో గిరిజనులు ఇటుకల పండగగా నిర్వహిస్తుంటారు. ఈ పండగను వారం రోజుల పాటు జరుపుకొంటారు. ఈ పండగ జరిగే వారం రోజులూ ఎవ్వరూ బయటకు వెళ్లి పనులు చేయకూడదనే ఆచారం ఉంది. మహిళలందరూ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రంగు నీళ్లు చేతపట్టుకుని తమకు వరుస అయ్చేవారిపై నీళ్లను పోసి ఆట పట్టిస్తారు.
పురుషులు ఆడవిలో వేటాడాల్సిందే..
పురుషులంతా అడవికి వెళ్లి జంతువులను వేటాడాలన్న నిబంధన ఉంది. ఏదైనా జంతువును వేటాడిన వ్యక్తిని గ్రామ పొలిమేర నుంచి మంచం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ గ్రామ దేవత వద్దకు తీసుకువస్తారు. ఒక వేళ వేటకు వెళ్లకపోయినా, బయట పనులకు వెళ్లినా పురుషులకు జరిమానా విధించి కొంత డబ్బులు వసూలు చేస్తారు. గ్రామాల్లోని మహిళలంతా కలిసి గ్రామంలోని ప్రధాన రహదారుల వద్దకు చేరి గేట్లు వేసి పజోర్(డబ్బులు) వసూలు చేస్తారు. ఇటుకల పండగ చివరి రోజు గ్రామ పెద్దలు పూజలు నిర్వహించిన విత్తనాలను గ్రామంలోని రైతులకు పంచిపెడతారు. తొలకరి వర్షం తరువాత గ్రామ పెద్దలు ఇచ్చిన విత్తనాలను ముందుగా పంట పొలాల్లో చల్లి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీ. ఇందుకోసం ఊరి పొలిమేరలో గేటు పెట్టి, అలా వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేసే వారు. ఈ డబ్బులతో పండుగకు అవసరమైన దినుసులు కొనుగోలు చేసి ఊరంతా సహపంక్తి భోజనాలు చేస్తారు. సాయంత్రం పూట ఆదివాసీ మహిళలు థింసా నృత్యాలతో అలరిస్తారు. కానీ మారుతున్న కాలంతో పాటు గిరిజనులు కూడా తమ ఆచారాలను క్రమేణా విస్మరిస్తున్నారు. అడవుల్లో వణ్యప్రాణులు, క్రూరజంతువులు పూర్తిగా తగ్గిపోయాయి. దీనికితోడు వన్యప్రాణులను వధిస్తే చట్ట ప్రకారం తీవ్ర శిక్షలు పడే అవకాశం ఉండడంతో అడవుల్లో వేటకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. గ్రామాల్లో గేట్లు పెట్టే సంప్రదాయాన్ని వదిలేశారు. రహదారులపై గేట్లు పెట్టి రాకపోకలు సాగించే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
రహదారులపై గేట్లు ఏర్పాటు
చేసి పండగ చందాలు వసూలు
అడవిలో వేటాడితేనే గ్రామంలోకి
పురుషులకు ప్రవేశం
లేదంటే కట్టుబాటు మేరకు జరిమానా


