డుంబ్రిగుడ: అరకు–పాడేరు జాతీయ రహదారిని దాటుతున్న పాడేరు మండలం మోదపల్లి పంచాయతీ బుర్రగురువు గ్రామానికి చెందిన కొర్రా కాసులమ్మ బైక్ ఢీకొని గాయాలు పాలైంది. వివరాలిలా ఉన్నాయి. అరకులోయలో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాఫీ రైతులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి పలువురు మహిళలు బయలుదేరి వెళ్లారు. కురిడి సమీపంలోని పెద్దబ్రిడ్జి వద్ద జాతీయ రహదారిలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం తోటి మహిళలతో కలిసి కాసులమ్మ దిగి రోడ్డు దాటే క్రమంలో అరకు నుంచి వస్తున్న బైక్ బలంగా ఢీకొంది. గాయపడిన ఆమెను డుంబ్రిగుడ ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


