మన్యంలో గ్యాస్ కష్టాల తీవ్రతకు ఈ చిత్రమే నిదర్శనం. అరకులోయ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం గ్యాస్ బండ్ల కోసం ప్రజలు బారులు తీరారు. మైదాన ప్రాంతాలైన ఎస్.కోట, వడ్డాది మాడుగుల నుంచి భారత్, హెచ్‌పీ ఏజెన్సీల నుంచి గ్యాస్ బండ్లను ఇక్కడి తీసుకువచ్చి సరఫరా చేస్తుంటారు. స్థానికంగా ఇండియన్ గ్యాస్ బండ్లను పంపిణీ చేస్తున్నారు. భారత్ గ్యాస్ వినియోగదారులు తెల్లవారుజాము నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రోజూ ఖాళీ బండ్లతో క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మండు టెండలో గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి అపోహాలకు పోవద్దని గ్యాస్ కంపెనీల ఏజెన్సీలు చెబుతున్నా.. బుక్ చేసి రోజులు గడుస్తున్నా గ్యాస్ బండ్లు ఇంటికి రాకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క కమర్షియల్ గ్యాస్ బండ్ల సరఫరా లేకపోవడంతో పలు హోటళ్ల యజమానులు కట్టెల పొయ్యిలతో వంటలు చేస్తున్నారు. – అరకులోయటౌన్


