అరకు ఎంపీ చొరవతో పది అంబులెన్సులు
పాడేరు : అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి చొరవతో జిల్లాకు పది అంబులెన్సులు సమకూరాయని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. శనివారం ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారి వద్ద పది కొత్త అంబులెన్సులను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, కలెక్టర్ దినేష్‌కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ చొరవతో అప్పటి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ నిధులతో ఏకంగా పది అంబులెన్సులు సమకూర్చడం గొప్ప విషయమన్నారు. అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో గిరిజనులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రులకు తరలించేందుకు పడుతున్న అవస్థలు కళ్లారా చూశానన్నారు. దీంతో తాను ఎంపీగా గెలిచిన వెంటనే సమస్యను అప్పటి వైఎస్సార్‌సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి దృష్టికి తీసుకువెళ్లి పార్లమెంట్ నిధులతో పది అంబులెన్సులు మంజూరు చేయించినట్ట చెప్పారు. వీటిని సక్రమంగా వినియోగించి రోగులను సకాలంలో ఆస్పత్రులకు తరలించేందుకు వినియోగించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టి. ప్రతాప్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమలకుమారి, జిల్లా కార్యక్రమాల పర్యవేక్షణ అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు,
ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
పాడేరులో జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ తనూజరాణి తదితరులు


