కనీస వేతనం చెల్లించాలని ధర్నా
● ఫీల్డ్ అసిస్టెంట్ల్ల ఆందోళన
చింతూరు : కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం స్థానిక ఐటీడీఏ ఎదుట ధర్నా చేశారు. సీఐటీయూ అనుబంధ ఎఫ్‌ఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారు ఈ ఆందోళన చేపట్టారు.ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో గత 19 ఏళ్లుగా పని చేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లు వేతన దారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారన్నారు. పథకం విజయవంతంలో వీరి కృషి ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇస్తున్న రూ. 5,745 జీతం వారి కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామని, అయితే ఈ ప్రభుత్వంలో కూడా తొలగింపు పెద్ద ఎత్తున జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోయారు. తమకు ప్రమాదవశాత్తూ అంగవైకల్యం సంభవించినా, మరణించినా ఎక్స్‌గ్రేషియా రూ. 25లక్షలు ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. సీఐటీయూ మండల కన్వీనర్ లక్ష్మణ్, ఎఫ్‌ఏల జిల్లా కార్యదర్శి కొమరం రామకృష్ణ, ఉపాధ్యక్షులు శంకర్, గంగరాజు, అర్జున్, సూరమ్మ పాల్గొన్నారు.


