డిజిటల్ ట్విన్స్‌తో రియల్ టైమ్ పర్యవేక్షణ
ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్
మురళీనగర్ : డిజిటల్ ట్విన్స్ ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణ చేయవచ్చని ఎన్‌ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ తెలిపారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నిర్వహిస్తున్న అటల్ వాణి జాతీయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా వాహనాలు, యంత్రాల వర్చువల్ నమూనాలు రూపొందించవ్చన్నారు. వాటి పనితీరును నియంత్రించడం, పర్యవేక్షించడంలో కచ్చితత్వం సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్ సాంకేతిక రంగంలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ నిర్ణయాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలక వాహనాల తయారీ, లాజిస్టిక్ రంగాల్లో క్యాంటం కంప్యూటింగ్ నూతన తరం ఆప్టిమైజేషన్, సిమ్యులేషన్ సాధనంగా అవతరిస్తోందని వివరించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శశిభూషణ్ మాట్లాడుతూ హై స్పెక్ట్రల్ ఇమేజింగ్ సాంకేతికత ద్వారా అత్యంత స్పష్టతతో మట్టి లక్షణాలు, వివిధ పదార్థాల పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. బబుల్ కర్టెన్, బబుల్ షీల్డింగ్ టెక్నాలజీ ఉపయోగించి సబ్‌మెరీన్ వేగాన్ని పెంచవచ్చని చెప్పారు. అనంతరం సదస్సు సావనీర్ ఆవిష్కరించారు.
60 పరిశోధనా పత్రాలకు ఆమోదం
సదస్సులో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన 60 సాంకేతిక పరిశోధన పత్రాలను ఆమోదించారు. మొదటి రోజు యాంత్రిక, విద్యుత్, ఎలక్ట్రానిక్, సివిల్, కమికల్ ఇంజినీరింగు, ఫార్మసీ, ఇంగ్లిష్, గణిత విభాగాల నుంచి 30 పరిశోధనా పత్రాలు ప్రదర్శించారు. సదస్సు కోఆర్డినేటర్ సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు, ఎన్‌ఎస్టీఎల్ మాజీ అదనపు డైరెక్టర్ డాక్టర్ పీవీఎస్ గణేష్ కుమార్, స్టీల్‌ప్లాంట్ మాజీ జనరల్ మేనేజర్ ఓ.రామ్మోహనరావు, హైడల్ విద్యుత్ సౌధ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లెక్కల నానాబాబు, ఎన్‌ఎస్‌టీఎల్ అదనపు డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఉపన్యసించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.ఫణికృష్ణ, కో–కోర్డినేటర్లు డాక్టర్ రాజు చిట్ల, భరణి మారోజు తదితరులు పాల్గొన్నారు.


