ఈ కమీషన్‌తో బతకలేం..
● వడ్డాది రేషన్ డీలర్ రాజీనామా
బుచ్చెయ్యపేట : మండలంలోని మేజర్ పంచాయతీ వడ్డాది రేషన్ డిపో నంబర్ 10 డీలర్ దొండా వెంకట రామ అన్నయ్యదొర రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన బుచ్చెయ్యపేటలో తహసీల్దార్ లక్ష్మికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. 32 ఏళ్లకు పైగా రేషన్ డీలర్‌గా చేసిన తాను ఇప్పుడున్న పరిస్థితిలో రేషన్ డీలర్‌గా కొనసాగలేనని రాజీనామా పత్రంలో అన్నయ్యదొర పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు రావాల్సిన నెలవారీ కమీషన్ కూడా ఇవ్వలేకపోతోందని, నెలంతా కష్టపడిన అరకొర కమీషన్‌తో జీవించలేక పోతున్నామని వాపోయారు. ప్రభుత్వం గత మూడు నెలలుగా కమీషన్ కూడా అందించకపోగా, ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం అందించమని అధికారుల వేధింపులకు విసుగు చెంది తన డీలర్ షిప్‌నకు రాజీనామా చేసినట్లు తెలిసింది.


