భర్త ఆచూకీ కోసం వేడుకోలు
భర్త ప్రసాద్ ఆచూకీ తెలపాలని కోరుతున్న భార్య డాలమ్మ, కుటుంబ సభ్యులు
ముంచంగిపుట్టు: తన భర్త కుర్తాడి ప్రసాద్(45) కనిపించడం లేదని, ఆచూకీ తెలియజేయాలని మండలంలో బంగారుమెట్ట పంచాయతీ కించాయిపుట్టు గ్రామానికి డాలమ్మ, కుటుంబ సభ్యులు వేడుకొంటున్నారు. అతని భార్య డాలమ్మ స్థానిక విలేకరులకు మంగళవారం వివరాలు తెలియజేసింది. పదేళ్లుగా విశాఖపట్నం షీలానగర్‌లో భర్త ప్రసాద్, ఇద్దరు పిల్లలతో నివాసముంటూ భవననిర్మాణ పనులు చేస్తూ జీవిస్తున్నామని తెలిపింది. గత నెల 28న బయటకు వెళ్లిన ప్రసాద్ తిరిగి ఇంటికి రాలేదని, దీంతో పనిచేసే ప్రదేశాలలో, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోయిందని చెప్పింది. ఈ నెల 4వ తేదీన దువ్వాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పింది. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేయలేదని, లేనిపోని కారణాలు చెబుతూ తనను పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పించారని వాపోయింది. దీంతో తన స్వగ్రామం కించాయిపుట్టు వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్‌లో తెలియజేసినా ఫలితం లేకపోయిందని తెలిపింది. సంఘటన జరిగిన ప్రాంతం దువ్వాడ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారని ఆమె చెప్పింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆమె రోదించింది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ప్రసాద్ ఆచూకీ కనుగొనేలా ఆదేశాలు జారీ చేయాలని డాలమ్మ, ఆమె కుటుంబ సభ్యులు, కించాయిపుట్టు గ్రామస్తులు వేడుకుంటున్నారు.
భర్త ఆచూకీ కోసం వేడుకోలు


