సింహగిరిపై మోగిన నెలగంట
సింహాచలం: ధనుర్మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని సింహగిరిపై నెలగంట ఉత్సవాన్ని మంగళవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. నెలరోజులపాటు జరిగే ధనుర్మాస పూజలను పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని, ఆళ్వారులను ఆస్థాన మండపంలో వేదికపై వేంజేపచేశారు. ధనుర్మాస ప్రారంభ నివేదనం, తిరుప్పావై సేవాకాలం, ధనుసంక్రమణ ప్రవేశ పూజలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారిని పల్లకీలో వేంజేపచేసి ఆలయ బేడామండపంలో తిరువీధి జరిపారు. గోదాదేవి సన్నిధిలో తొలి పాశుర విన్నపాన్ని పఠించారు. తదుపరి ఆలయ రాజగోపురంలో మధ్యాహ్నం 1.01 గంటలకు నెలగంటను మోగించారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు చిన్నా తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


