హోం మంత్రి, స్పీకర్ అండతోనే రంగురాళ్ల తవ్వకాలు
చింతపల్లి: రాష్ట్ర హోం మంత్రి, స్పీకర్ అండదండలతోనే జిల్లాలో రంగురాళ్ల మాఫియా రెచ్చిపోతోందని చింతపల్లి జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య ఆరోపించారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో ఇటీవల రంగురాళ్ల అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన చింతపల్లిలో విలేకరులతో మాట్లాడారు. సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద కాపలాగా ఉన్న అటవీ సిబ్బందిని ప్రలోభపెట్టి, భయాందోళనలకు గురిచేసి రంగురాళ్ల తవ్వకాలకు కొందరు వ్యాపారులు ప్రయత్నాల చేస్తున్నారని చెప్పారు. దీనివెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. తమ వెనుక హోంమంత్రి, స్పీకర్ ఉన్నారని, తమను ఎవరూ ఏమీ చేయలేరని కొందరు వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు. అమాయక ఆదివాసీ గిరిజనులకు మద్యం, కొంత నగదును ఎరగా వేసి వారిని పావులుగా వాడుకుంటున్నారన్నారు. క్వారీలో ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయేది అమాయక గిరిజనులేనని చెప్పారు. అధికారులు రంగురాళ్ల వ్యాపారులపై నామమాత్రపు కేసులను పెట్టి ఊరుకోకుండా, పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు అవసరమైతే వారి ఆస్తులను జప్తుచేయాలని బాలయ్య డిమాండ్ చేశారు.


