దళారులకే రాజ్‌మా!
పాడేరు మండలం గుత్తులపుట్టులో కోతకు సిద్ధంగా రాజ్‌మా పైరు
సాక్షి,పాడేరు: మన్యంలో రాజ్‌మాను సాగు చేసే రైతులకు కష్టాలు తప్పడం లేదు. వీటిని కొనుగోలు చేసే దళారులు, రిటైల్ వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. పండించే రైతులకు గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోతున్నారు. పోడు, మెట్ట భూముల్లో ఈ పంటను సేంద్రియ విధానంలో పండించడం వల్ల మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కిలో ఎరుపు రకం రూ.200, తెలుపు రూ.250 ధరతో మార్కెట్‌లో వ్యాపారం జరుగుతోంది. క్రిస్మస్, సంక్రాంతి పండగల ఆర్థిక అవసరాలు తీర్చే ఆదాయ పంటగా పేరొందినా.. రెండేళ్లుగా పరిస్థితులు కలిసిరావడం లేదని గిరిజన రైతులు వాపోతున్నారు.
●పాడేరు డివిజన్ 11 మండలాల్లో 12వేల హెక్టార్లలో రాజ్‌మాను సాగుచేస్తున్నారు.వ్యవసాయఽశాఖ కూడా ఈ ఏడాది 10వేల హెక్టార్లలో సాగుకు సరిపడేలా 4,900 క్వింటాళ్ల విత్తనాలను గిరిజన రైతులకు పంపిణీ చేసింది. మిగిలిన వ్యవసాయ భూముల్లో ఎరుపు,తెలుపు రాజ్‌మా పంటల సాగుకు గిరిజన రైతులు తమ సొంత విత్తనాలను వినియోగించారు. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి.సేకరించిన పంటను ఎండబెట్టి గ్రేడింగ్ చేసే పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమయ్యారు. ఎకరాకు 350 నుంచి 400 కిలోల వరకు దిగుబడి రావచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా ఎకరా పంట ద్వారా రూ.30వేల నుంచి రూ.40వేల మధ్య ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడికి, వచ్చిన ఆదాయం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
●రాజ్‌మా పంటకు జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉంది. అయినప్పటికీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం కొనుగోలు ధరలు పెరగడం లేదు. గత ఏడాది రాజ్‌మా దిగుబడులు భారీగా తగ్గాయి. అధిక వర్షాలతో పంటకు నష్టం ఏర్పడింది.అయినప్పటికీ వ్యాపారులు ఎరుపు రంగు రాజ్‌మాను కిలో రూ.100,తెలుపు రకం రూ.110లోపు ధరకు మాత్రమే కొనుగోలు చేశారు.
●గిరిజన రైతులు సాగు చేసే వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన జీసీసీ కూడా వ్యాపార సంస్థగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నప్పటికి గత సీజన్ చివరిలో ఽఽజీసీసీ కిలో రూ.90 ధర ప్రకటించింది. అప్పటికే దళారులు ఎరుపు రంగు రాజ్‌మాను కిలో రూ.100తో కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ధర ప్రకటించకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎరుపు రాజ్‌మా గింజలను కిలో రూ.150 ధరకు జీసీసీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
●దళారుల దోపిడీ నుంచి విముక్తి కలగాలంటే, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. ప్రభుత్వమే నేరుగా మన్యం గ్రామాల్లో రాజ్‌మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. గిరిజన సహకార సంస్థ గిట్టుబాటు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సంఘాల ద్వారా పట్టణాల్లో ’మన్యం రాజ్‌మా’ పేరుతో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి, దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని గిరి రైతులు విన్నవిస్తున్నారు.


