కాఫీ రైతులకు అందని ప్రోత్సాహక నిధులు
అరకులోయ టౌన్: కాఫీ రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహక నిధులు కాఫీ రైతుల ఖాతాలో జమచేయాలని కాఫీ రైతు సంఘ ప్రతినిధి గెమ్మెలి చినబాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన స్థానిక గిరిజన సంఘ కార్యాలయంలో మాట్లాడారు. సేంద్రియ విధానంలో పండించే కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ పండించే రైతులకు కాఫీ బోర్డు ప్రోత్సాహకాలు అందించడం లేదన్నారు. 2023లో 10వేల ఎకరాల్లో కొత్తగా కాఫీ నాటిన 10వేల మంది రైతులకు, 2024లో 12వేల ఎకరాల్లో కన్సలిడేషన్ కింద కాఫీ నాటిన 12వేల మంది రైతులకు, 2025లో 8వేల ఎకరాల్లో కన్సలిడేషన్ పనులు చేసిన రైతులకు ఎకరాకి రూ.9 వేల చొప్పున నేటికీ వారి ఖాతాల్లో జమచేయలేదన్నారు. మూడేళ్లకు సంబంధించి ప్రోత్సాహక నిధులు రూ.కోట్లలో చెల్లించాల్సి ఉందన్నారు. పాత బకాయిలు రూ.67 కోట్లు కూడా చెల్లించాలని కాఫీ రైతులు పాడేరు ఐటీడీఏ ఎదుట ఆందోళన చేపట్టినప్పుడు వెంటనే జమ చేస్తామని చెప్పిన అధికారులు ఆ తరువాత విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖల అధికారులకు బదిలీలు జరుగుతున్నాయన్నారు. కాఫీ బోర్డులో గత కొన్నేళ్లుగా సుదీర్ఘంగా పనిచేస్తున్న ఉన్నతాధికారులకు బదిలీలు లేనందున వారు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికై నా ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, కాఫీ అధికారులు స్పందించి కాఫీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే జమ చేయాలని చినబాబు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాఫీ సంఘం జిల్లా నాయకులు పి. లక్కు తదితరులు పాల్గొన్నారు.


