రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు
గూడెంకొత్తవీధి: రక్షిత అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చొరబడి రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడేవారితోపాటు, తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుధాకర్ హెచ్చరించారు. దావనాపల్లి సమీపంలోని సిగనాపల్లి కొండపై ఆదివారం రాత్రి రంగురాళ్ల తవ్వకాలు జరిగినట్టు వచ్చిన సమాచారంపై ఆయన విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా చింతపల్లి ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులతోపాటు క్వారీ పరిసర గ్రామాలకు చెందిన గిరిజనులను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా సంచరించడం, రంగురాళ్ల తవ్వకాల పేరుతో అలజడి సృష్టించడం, శాంతి భద్రతలకు విఘాతం కల్గించడం చట్టరీత్యా నేరమని వారికి సీఐ సూచించారు. ప్రాథమిక విచారణలో గుర్తించిన 16మందిపై బైండోవర్ నమోదు చేస్తున్నామన్నారు. ఎస్‌ఐ సురేష్‌తో కలిసి మంగళవారం సిగనాపల్లి క్వారీని పరిశీలించారు. అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు అందించాలని సీఐ సూచించారు.


