అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు విస్తృతం
అడ్డతీగల: గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో కొనుగోళ్లు విస్తృతం చేస్తామని ఆ సంస్థ మార్కెటింగ్ విభాగం జీఎం ఎస్.త్రినాథరావు తెలిపారు. మంగళవారం ఆయన జీసీసీ స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలోని అటవీ ఉత్పత్తులు, కొనుగోళ్ల వివరాలను సిబ్బంది నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులు పండించిన, సేకరించిన అటవీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలుకు సంకల్పించామన్నారు. ఈ మేరకు సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులపై దళారుల ప్రభావం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతామన్నారు. గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొనుగోలు చేసే ఉత్పత్తులు, నిర్ణయించిన ధర, మార్కెటింగ్ తదితర అంశాలపై కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. రాజవొమ్మంగి, అడ్డతీగల బ్రాంచీల సిబ్బందికి ఇప్పటికే సూచనలు ఇచ్చామన్నారు. ఆయన వెంట రంపచోడవరం డీఎం విజయలక్ష్మి ఉన్నారు.


