అఖిలభారత మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
చింతపల్లి: అఖిల భారత మహాసభల వాల్‌పోస్టర్లను కార్మికులతో కలిసి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుళ జాతి సంస్థలకు కొమ్ము కాసే ప్రభుత్వాలతో కార్మికులు పోరాటం చేస్తున్నారన్నారు. దేశ ప్రజల ఆస్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తున్నాయని మండిపడ్డారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఆయిల్ కంపెనీలు, ఉక్కు ఫ్యాక్టరీలను పెట్టుబడుదారులకు ప్రధాని మోదీ అప్పచెబుతున్నారన్నారు. అంబాని, అదాని, టాటాలకు లక్షల కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తులను తక్కువ ధరకు కట్టబెడుతున్నారని తెలిపారు. ప్రజల డబ్బులతో నిర్మితమైన రైల్వే, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, పోర్టులను కార్పొరేట్ శక్తుల గుప్పెట్లో పెడుతున్నారన్నారు. ఇటువంటి తరుణంలో జరుగుతున్న మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.


