356 ఎకరాలకు పట్టాలు మంజూరు చేయండి
రంపచోడవరం: రంపచోడవరం మండలం కాకవాడ–ఆకూరు గ్రామం వరకు సమారు 13 కిలోమీటర్లు రహదారికి అటవీ అభ్యంతరాలు తొలగించి రోడ్డు నిర్మాణం చేయాలని కత్తుల రామకృష్ణారెడ్డి, చుండ్రు అబ్బాయిరెడ్డి, చిన్నారావు సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో బచ్చు స్మరణ్‌రాజ్, సబ్ కలెక్టర్లు శుభమ్ నొఖ్వాల్, సాహిత్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ వారం 86 అర్జీలు వచ్చినట్లు పీవో తెలిపారు. వేములకొండ గ్రామంలోని రెవెన్యూ భూముల్లో శతాబ్దాల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న 112 మంది గిరిజనులకు సుమారు 356 ఎకరాలకు పట్టాలు మంజూరు చేయాలని అరగాటి రామకృష్ణారెడ్డి కోరారు. వెలమలకోట గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించి మధ్యలో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని గిరిజన మహిళాలు కోరారు. రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామం నుంచి కొత్తపాకలు గ్రామం వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. కొత్తపాలెం గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
పాఠశాల భవనం లేక ఇబ్బందులు
మారేడుమిల్లి మండలం ధారవాడ గ్రామంలో 11 ఏళ్లుగా పాఠశాలకు భవనం లేదని గిరిజనులు రంపచోడవరం ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని పిల్లల తల్లులు ఐటీడీఏకు వచ్చి తమ నిరసన తెలిపారు. గ్రామ పెద్ద పల్లాల ధర్మారెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు భవనం నిర్మించాలని అనేక సార్లు అధికారులను కోరామన్నారు. గతేడాది నాడు–నేడులో పాఠశాల భవనం మంజూరు చేసి, పునాది వరకు నిర్మాణం చేపట్టారన్నారు. దీనిపై విద్యార్థుల తల్లులతో కలిసి పీవోకు అర్జీ అందజేశామన్నారు.వారంలో సమస్య పరిష్కరిస్తామని పీవో హామీ ఇచ్చినట్టు ధర్మారెడ్డి తెలిపారు. దేవీపట్నం మండలం వెలగపల్లి గ్రామం వద్ద వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు కోరారు. కాలువ పొంగి ప్రవహించినప్పుడు గుంపెన పల్లి నుంచి వెలగపల్లిలోని పాఠశాలకు విద్యార్థులు వెళ్లలేకపోతున్నారని అర్జీలో పేర్కొన్నారు.
ఐటీడీఏ పీవోకు అర్జీ అందజేసిన గిరిజనులు
356 ఎకరాలకు పట్టాలు మంజూరు చేయండి


