ఓజుబంద క్వారీతో అనారోగ్యం
గంగవరం/రంపచోడవరం: గంగవరం మండలం ఓజుబంద గ్రామానికి సమీపంలో ఉన్న నల్లరాయి క్వారీని మూసివేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో ఆందోళన నిర్వహించారు. ఓజుబంద క్వారీలో నిర్వహిస్తున్న బాంబ్ పేలుళ్లుతో నివాస గృహాలు, టీవీలు పగిలిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు. బ్లాస్టింగ్, క్రషర్ వల్ల వచ్చే దుమ్ముతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడు క్వారీలు నిర్వహణలో ఉండగా మరొక కొత్త క్వారీ మొదలు పెడుతున్నారని దీనిపై గ్రామసభలో అందరూ వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. మూడు క్వారీలు మూసివేయాలని, కొత్త క్వారీ నిర్వహణకు అనుమతులు ఇవ్వవద్దని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తున్న క్వారీలు ఎవరి ప్రయోజనాలు కోసమని ప్రశ్నించారు. గిరిజనులు ఇబ్బందులు పడుతున్న మైనింగ్ లీజులు ఎలా ఇస్తారని ఆరోపించారు.అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గిరిజనులు ఐక్యంగా వీటిని ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుంజం లక్ష్మణరావు, చోడి ప్రదీప్‌కుమార్‌దొర, పీఠా ప్రసాద్, చోడి ఏడుకొండలరావు, కంగాల అబ్బాయిదొర, పోతురాజు, రాధాకృష్ణదొర తదితరులు పాల్గొన్నారు.


