18న సహస్ర ఘటాభిషేకం
డాబాగార్డెన్స్ (విశాఖ): సిరులతల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న నాలుగో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల వరకు అమ్మవారికి మహానివేదన(రాజభోగం), 12 నుంచి 3 గంటల వరకు సర్వదర్శనం అనంతరం దర్శనాలు నిలిపివేయనున్నారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన అనంతరం 7 నుంచి అమ్మవారి దర్శనాలకు అనుమతి కల్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 20 వేల మంది భక్తులకు మహాన్నదాన కార్యక్రమం టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయ మెయిన్‌రోడ్డులో నిర్వహించనున్నారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 సాయంత్రం 6.30 గంటల నుంచి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో దేవస్థానం, ఇతర దేవాలయాలకు చెందిన నాదస్వరం, డోలు విద్వాన్లచే నాదస్వర కచేరీ నిర్వహించనున్నారు.


