అదుపు తప్పితే లోయలోకి..
సాక్షి,పాడేరు: ఘాట్ రోడ్లలో పూర్వం నిర్మించిన రక్షణ గోడలు శిథిలమవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే సుమారు 25 కిలోమీటర్ల పాడేరు ఘాట్‌రోడ్డులో ఎక్కడకక్కడ రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. పర్యాటకులు వివిధ ప్రాంతాలనుంచి పర్యాటకులు ఈ మార్గంలో మన్యం సందర్శనకు వస్తుంటారు. వాహనాలు ఏమాత్రం అదుపుతప్పినా లోయలోకి బోల్తా కొట్టే పరిస్థితి నెలకొన్నాయి. దీంతో భయభయంగా వాహనాలు నడపాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల శిథిలమైన రక్షణగోడలు వద్ద పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో వాహనచోదకులకు అంచనా తెలియడం లేదు. గత నెలలో కొన్ని ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్‌ను ఆర్‌అండ్‌బీశాఖ చేపట్టినప్పటికీ వంట్లమామిడి దాటిన తరువాత యేసుప్రభువు విగ్రహం మలుపు నుంచి గరికిబంద వరకు పనులు జరగలేదు. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున పలు చోట్ల రోడ్డుకు ఇరువైపులా తుప్పలు, డొంకలు పెరగడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రక్షణ గోడల నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదిక
పాడేరు ఘాట్‌లో ధ్వంసమైన రక్షణ గోడల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరు అవ్వగానే ఘాట్ మార్గంలో రక్షణ గోడల నిర్మాణం చేపడతాం.
– విజయ్‌కుమార్,
ఆర్‌అండ్‌బీ ఈఈ, పాడేరు


