కోటి సంతకాల ర్యాలీని విజయవంతం చేయండి
సాక్షి,పాడేరు: రాష్ట్రంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన కోటిి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. అరకులో 53వేలు, పాడేరులో 50 వేలు,రంపచోడవరంలో 40వేల సంతకాలను సేకరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణలో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎంతో శ్రమించారన్నారు. పాడేరు, అరకులోయ పరిధిలోని సంతకాల ప్రతులను ఇక్కడి జిల్లా పార్టీ కార్యాలయంలో భద్రపరిచామని తెలిపారు. ,రంపచోడవరం పరిధిలోని ప్రతులు కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నాయన్నారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాల పరిధిలో సేకరించిన సంతకాల ప్రతులను ప్రత్యేక బాక్స్‌లలో భద్రపరిచి వాటితో ఈనెల 15వతేదీన జిల్లా కేంద్రంలో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. సుమారు ఐదు వేల మంది పార్టీ నేతలు,కార్యకర్తలతో పాడేరు పురవీధుల్లో ర్యాలీ జరుగుతుందన్నారు. అనంతరం స్థానిక వీఆర్‌పంక్షన్ హాల్ వద్ద ప్రతుల బాక్సులను విజయవాడకు ప్రత్యేక వాహనంలో తరలింపు కార్యక్రమం చేపడతామన్నారు. అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, అనంత ఉదయ్‌భాస్కర్,మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి (ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు), నాగులపల్లి ధనలక్ష్మి, చెట్టి పాల్గుణ(సీఈసీ సభ్యుడు),అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్.అరకు,పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జి యేరువాక సత్యారావు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు అనుబంధ విభాగాల ప్రతిధులు, పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపు


