జంతు గణన ప్రారంభం
● ఈనెల 15 నాటికి ఆన్‌లైన్‌లోపూర్తి సమాచారం
● చింతపల్లి డీఎఫ్‌వో వైవీ నర్సింగరావు
సీలేరు: జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకునేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభమైంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఆల్–ఇండియా టైగర్ ఎస్టిమేషన్ నిర్వహిస్తారు. దీనిలో భాగంగానే సాంకేతిక నిపుణుల బృందం ఈనెల ఒకటి నుంచి సర్వే చేపట్టింది. స్టేజ్ వన్ ప్రక్రియలో భాగంగా మూడు రోజులపాటు మాంసాహారం మరో మూడు రోజులపాటు శాకాహారం జంతువుల గణన చేపడుతున్నారు. ట్రయిల్ పాత్, ట్రాంజాక్ట్ పద్ధతుల్లో వన్యప్రాణుల గణన ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం అటవీ డివిజన్లలో జరుగుతోంది. అటవీ సంరక్షణ బాగుండటంతో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తూర్పు కనుమల సరిహద్దులో గతంలో కంటే ప్రస్తుతం పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. సీలేరు రేంజి పరిధి అటవీప్రాంతంలో గతంలో రోడ్డు దాటుతుండగా కనిపించిన చిరుత సురక్షితంగానే ఉన్నట్టు సర్వేలో తేలిందని తెలిపాయి. ఈ సందర్భంగా చింతపల్లి వైవీ నర్సింగరావు మాట్లాడుతూ సర్వే అనంతరం ఈనెల 15కల్లా పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. ప్రతి అటవీ డివిజన్‌లో ఏఏ జంతువులు ఉన్నాయి.. ఎక్కడ ఉన్నాయి.. ఆరోగ్యంగా ఉన్నాయా.. అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.


