అరణ్యంలో ఆర్తనాదాలు
● అయ్యో రామచంద్రా..
దైవ దర్శనం కోసం భద్రాద్రికి బయలుదేరిన ఆ యాత్రికులకు ఘాట్‌రోడ్డులో పొంచి ఉన్న మృత్యువు రూపంలో విధి ఎదురొచ్చింది. మరో రెండు గంటల్లో రాముడి సన్నిధికి చేరుకోవాల్సిన తరుణంలో..శుక్రవారం తెల్లవారుజామున చింతూరు–మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులోని రాజుగారిమెట్ట వద్ద వారి ప్రయాణం విషాదంగా ముగిసింది. కారు చీకట్లు, దట్టమైన మంచు తెరలు, ప్రమాదకరమైన మలుపులతో నిండిన ఆ మార్గంలో యాత్రీకుల బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లోయలో పడిపోయి గాయపడిన ప్రయాణికులు దారి తెలియక, బస్సులో చిక్కుకున్న వారు బయటకు రాలేక నరకయాతన పడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు చూసి అడవితల్లి సైతం కన్నీరుగార్చింది. దైవ దర్శనం కోసం బయలుదేరిన కుటుంబాలకు ఈ ఘోరం తీరని శోకాన్ని మిగిల్చింది.
ఘాట్‌రోడ్డులో ఎగువ ప్రాంతం నుంచి దిగువరోడ్డులోకి బోల్తాకొట్టిన ట్రావెల్ బస్సులోని
మృతదేహాలను అంబులెన్సులోకి ఎక్కిస్తున్న 108 సిబ్బంది
చింతూరు/మోతుగూడెం: మారేడుమిల్లి, చింతూరు ఘాట్‌రోడ్‌లో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదం హృదయ విదారకంగా మారింది. గాఢనిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటనతో బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. బస్సు నుంచి బయట పడేందుకు వారు తీవ్ర ప్రయత్నాలు చేసినా చీకటి కారణంగా ఏ వైపున ద్వారాలు ఉన్నాయో తెలియక, బయటకు రాలేక నానా నరకయాతన పడినట్లు క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
● సంఘటన స్థలంలో మృత్యువాత పడిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులు గాయాలతో ఆస్పత్రిలో విలవిల్లాడారు. తీవ్రచలి కారణంగా గాయాలైన వారు నొప్పులకు తాళలేక బోరున విలపించారు.
● అరకు నుంచి భద్రాచలం బయలుదేరిన యాత్రీకుల బస్సు మరో రెండు గంటల్లో గమ్యానికి చేరుకునేలోపు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చింతూరు మండలం తులసిపాక, 35 కిలోమీటర్ల దూరంలో చింతూరు ఉంది. ఘటనా స్థలంనుంచి వంద కిలోమీటర్ల దూరంలో భద్రాచలం ఉంది. మరో రెండు గంటలు సజావుగా ప్రయాణం సాగిఉంటే ఉదయం ఆరు గంటలకు వారు భద్రాచలం చేరుకుని సీతారాములను దర్శించుకునే వారు.
మృతదేహాలు తీసేందుకు ఇబ్బందులు
బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, 108 సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బస్సు యూ పిన్ టర్నింగ్ వద్ద పైరహదారి, కింద రహదారి నడుమ కొండపై వెల్లకిలా ఇరుక్కుపోయింది. దీంతో మృతదేహాలు సీట్ల నడుమ ఇరుక్కు పోవడంతో వాటిని చాలాసేపు శ్రమించి బయటకు తీశారు. బస్సు మట్టిదిబ్బను ఢీకొని ఎగిరి పడడంతో బస్సులోని యాత్రీకుల సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.
సమాచార వ్యవస్థలేక
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎలాంటి నెట్‌వర్క్ లేకపోవడంతో తమకు జరిగిన ప్రమాద వివరాలను కుటుంబ సభ్యులకు తెలిపేందుకు యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరి ఫోన్లు బస్సులోనే ఉండిపోవడం, మరికొందరి ఫోన్లు కింద పడిపోయాయి. దీంతో ఎవరి వద్దనైనా ఫోను ఉంటే ఇవ్వండి, నా భర్త చనిపోయారు, నా కూతురు, అల్లుడు చనిపోయిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలపాలంటూ సాయం కోసం వచ్చిన వారిని అభ్యర్థించడం అందరినీ కలచివేసింది. ఈ ప్రాంతంలో సిగ్నల్స్ రావని చింతూరు వెళ్లాక సమాచారం తెలపవచ్చంటూ పోలీసులు వారిని సముదాయించారు.
అధికారులు అప్రమత్తం:
సంఘటన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసేలా ఆదేశించారు. ముందుగా చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, ఓఎస్డీ పంకజ్‌కుమార్ మీనా, ఏఎస్పీ బొడ్డు హేమంత్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్‌దొర మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించారు. సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐలు రమేష్, సాధిక్, సంతోష్ మృతదేహాలతో పాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డితో పాట వైద్యులు హుటాహుటిన క్షతగాత్రులకు వైద్యసేవలు అందించారు. ఆసుపత్రి సిబ్బంది క్షతగాత్రులకు పాలు, భోజనాలు సమకూర్చారు.
అరకు నుంచి బయలుదేరి.. : సింహాచలంలో దర్శనం ముగించుకుని మధ్యాహ్నానికి అరకు చేరుకున్న యాత్రికులు అక్కడ అరకు అందాలను ఆస్వాదించారు. సాయంత్రం ఐదు గంటలకు అరకులో బయలుదేరిన బస్సును ప్రసాద్ డ్రైవింగ్ చేస్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో నర్శీపట్నం దాటాక టిఫిన్ చేసేందుకు బస్సు నిలిపారు. టిఫిన్ వండుకుని అందరూ తిన్న అనంతరం తిరిగి పది గంటల ప్రాంతంలో బయలుదేరారు. హైవే మీదుగా ఒంటిగంట సమయంలో జగ్గంపేట చేరుకున్న అనంతరం డ్రైవర్ ప్రసాద్ తాను రెస్ట్ తీసుకుంటానని చెప్పి మరో డ్రైవర్ మధుకు డ్రైవింగ్ బాధ్యతలు అప్పగించాడు. మధు జగ్గంపేట నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో నాలుగు గంటల సమయంలో ఘాట్‌రోడ్‌లో బస్సు ప్రమాదానికి గురైంది.
● పొగమంచు, అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు చెబుతున్నారు. పొగమంచు వల్ల రోడ్డు కనిపించకపోయినా వేగంగా మలుపు తిప్పిన సమయంలో తులసిపాక వద్ద.. మరో మలుపును డ్రైవర్ గుర్తించలేకపోయాడని వారు తెలిపారు. ప్రయాణికులు నిద్ర నుంచి తేరుకునేలోపే బస్సు లోయలో పడిపోయింది.
● చింతూరు–మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో తదుపరి ఆదేశాల వరకు ప్రతిరోజు రాత్రి10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు.
ఘాట్ రోడ్లలో భారీ వాహనాలపై నిషేధం
రాత్రి ప్రయాణంపై ఆంక్షలు
ఎస్పీ అమిత్ బర్దర్
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తుండడం, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాత్రి ప్రయాణాలను నిషేధిస్తున్నామని ఎస్పీ అమిత్‌బర్దర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు అన్ని రకాల భారీ వాహనాలను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పొగమంచు తీవ్రత తగ్గే వరకు ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. పోలీసుశాఖ హెచ్చరికలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులపై వాహన చోదకులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్న వాహనాల చోదకులు కూడా తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. మరిన్ని వివరాలకు ప్రయాణికులు,వాహన చోదకులంతా సమీప పోలీసుస్టేషన్లను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం
తులసిపాక వద్ద అదుపుతప్పి ట్రావెల్ బస్సు లోయలోకి బోల్తా
తొమ్మిదిమంది మృతి,22 మందికి తీవ్ర గాయాలు
మరో రెండు గంటల్లో భద్రాచలంచేరుకుంటామనగా ఘటన
పొగమంచు వల్ల కనిపించని రోడ్డు
మలుపులో బస్సు వేగాన్నిఅదుపుచేయలేకపోయిన డ్రైవర్
అరణ్యంలో ఆర్తనాదాలు
అరణ్యంలో ఆర్తనాదాలు
అరణ్యంలో ఆర్తనాదాలు
అరణ్యంలో ఆర్తనాదాలు
అరణ్యంలో ఆర్తనాదాలు
అరణ్యంలో ఆర్తనాదాలు
అరణ్యంలో ఆర్తనాదాలు


